logo

సమరయోధులకే అగ్రాసనం

బ్రిటిష్‌ కాలంనాటి రహదారులు, ఆసుపత్రులు, సంస్థలకు స్వాతంత్య్ర పోరాట యోధుల పేర్లు పెడతామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో

Published : 27 Jan 2022 00:39 IST


సంగొళ్లి రాయణ్ణ విగ్రహం వద్ద బొమ్మై, అశోక్, వాటాళ్‌ నాగరాజ్, హెచ్‌.ఎం.రేవణ్ణ తదితరులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బ్రిటిష్‌ కాలంనాటి రహదారులు, ఆసుపత్రులు, సంస్థలకు స్వాతంత్య్ర పోరాట యోధుల పేర్లు పెడతామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో సంగొళ్లి రాయణ్ణ చిత్రపటం ఆవిష్కరించే ఆదేశాలిస్తామని ప్రకటించారు. రాయణ్ణ 191వ వర్ధంతిని పురస్కరించుకుని బెంగళూరు ఖొడేస్‌ కూడలి వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయణ్ణ దేశభక్తి, స్వామి నిష్ట, ధైర్యం, సాహసం, లక్ష్యం.. ఇవన్నీ యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాయణ్ణ పేరిట 100 ఎకరాల విస్తీర్ణంలో సైనిక పాఠశాల నిర్మాణానికి రూ.55 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతలను సైన్యానికి అప్పగిస్తామని చెప్పారు. రాయణ్ణ పుట్టిన సంగొళ్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రాక్‌ గార్డెన్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. కిత్తూరు రాణిని గుర్తు చేసుకున్న వెంటనే రాయణ్ణ గుర్తుకు వస్తారని చెప్పారు. దిల్లీలో కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహం పక్కనే సంగొళ్లి రాయణ్ణ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి, లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్, రెవెన్యూ మంత్రి అశోక్, వేర్వేరు పార్టీల నాయకులు వాటాళ్‌ నాగరాజ్, హెచ్‌.ఎం.రేవణ్ణ, హుచ్చప్ప, అధికారులు రాకేశ్‌ సింగ్, మంజునాథ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని