logo

KGF Babu: కేజీఎఫ్‌ బాబుకి ఐటీ దడ

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఉమ్రా డెవలపర్స్‌ యజమాని యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు- ఆయన సంబంధీకులైన కొందరి నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం దాడి చేశారు. వసంతనగరలోని ఆయన నివాసం, కార్యాలయాలపై మూడు బృందాలుగా వచ్చిన అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.

Updated : 29 May 2022 11:12 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఉమ్రా డెవలపర్స్‌ యజమాని యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు- ఆయన సంబంధీకులైన కొందరి నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం దాడి చేశారు. వసంతనగరలోని ఆయన నివాసం, కార్యాలయాలపై మూడు బృందాలుగా వచ్చిన అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఏడాది కోలారు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కేజీఎఫ్‌కు చెందిన ఆయన రెండు దశాబ్దాల కిందట పాత సామగ్రి కొనుగోలు, విక్రయాలతో వ్యాపార జీవితంలో అడుగు పెట్టారు. విధాన పరిషత్తు ఎన్నికల సమయంలో తన ఆస్తి విలువను రూ.1,745 కోట్లుగా చూపించారు. ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తులకు- రిటర్న్‌లలో చూపించిన దాఖలాలకు పొంతన లేకపోవడంతో 40 మంది అధికారులు మూడు బృందాలుగా దాడులు చేశారని సమాచారం. కేజీఎఫ్‌ బాబు 2017-18లో రూ.14.89 లక్షలు, 2018-19లో రూ.42.35 లక్షలు, 2019-20లో రూ.49.74 లక్షలు, 2020-21లో రూ.15.86 లక్షల ఆదాయం గడించానని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఇదే పలు అనుమానాలకు కారణమైంది. బాబుకు ఇద్దరు భార్యలు. బాండ్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో రూ.17.62 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఐదు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. భారీ స్థాయిలో స్థిరాస్తులు, వ్యాపారాలు ఉన్న ఆయన ఐటీ రిటర్న్‌లలో తక్కువ రాబడిని చూపించడమే దాడులకు కారణమని ఆదాయ పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయన నివాసం, కార్యాలయాల నుంచి భారీ స్థాయిలో దస్త్రాలను స్వాధీనపరుచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని