logo

రాజ్యసభపై వీడని ఉత్కంఠ

రాజ్యసభ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఈనెల 24న నోటిఫికేషన్‌ విడుదలైనా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నుంచి మాత్రమే స్పష్టమైన అభ్యర్థి పేరు వెల్లడైంది. కనీసం రెండు స్థానాలు కైవసం చేసుకునే భాజపాలో ఇంత వరకు ఎంపిక ప్రక్రియలో కదలిక లేదు.

Published : 29 May 2022 03:27 IST

జైరామ్‌ రమేశ్‌

ఈనాడు, బెంగళూరు : రాజ్యసభ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఈనెల 24న నోటిఫికేషన్‌ విడుదలైనా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నుంచి మాత్రమే స్పష్టమైన అభ్యర్థి పేరు వెల్లడైంది. కనీసం రెండు స్థానాలు కైవసం చేసుకునే భాజపాలో ఇంత వరకు ఎంపిక ప్రక్రియలో కదలిక లేదు. అధిష్ఠానం, రాష్ట్ర కార్యవర్గాల మధ్య పరిశీలనలో ఉన్న పేర్లపై పెరుగుతున్న అసహనం ఆయా పార్టీలకు చిక్కులు తెచ్చిపడుతున్నాయి.

నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రిగా రాణించిన నిర్మలా సీతారామన్‌ను మరోమారు రాష్ట్రం నుంచి ఎన్నుకోవటంపై అధికార పక్షంలో నిరసన స్వరం వినిపిస్తోంది. బహిరంగంగా తమ అసహనాన్ని వ్యక్తం చేయకపోయినా స్థానికత, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి చేకూర్చిన లబ్ధి అంతగా లేదన్న వాదన భాజపాలో వినిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలోనూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం మద్దతు దండిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను అడ్డుకునే సత్తా రాష్ట్ర బృందానికి లేదన్న వాస్తవం బహిరంగ సత్యం. ఇదే పార్టీ నుంచి మరో అభ్యర్థి కేసీ రామ్మూర్తి స్థానికేతరులైనా ఆయన రాష్ట్రంలో స్థాపించిన విద్యా సంస్థలు, ఇతర వ్యాపారాల్లో స్థానికులకు ఇస్తున్న అవకాశాలు సానుకూలాంశాలు.

2016లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు వెళ్లిన జైరాం రమేశ్‌ ఈ ఆరేళ్లలో చేసిందేమీ లేదని పార్టీకి చెందిన సీనియర్‌ నేత వి.ఆర్‌.సుదర్శన్‌ నేరుగా విమర్శించారు. పేరుకే ఆయన కర్ణాటక (చిక్కమగళూరు)కు చెందినవారు. ఆయనకు రాష్ట్రంలో ఎమ్మెల్యేలెంతమందో తెలియదు. ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అసలు పార్టీ కార్యవర్గంతో కనీస సంబంధాలు లేని ఆయనకు మరోమారు అవకాశం ఇవ్వటం ఎందుకుని సుదర్శన్‌ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. జూన్‌లో నిర్వహించే పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రశ్నిస్తానని సవాలు విసిరారు. ఇన్ని ఆక్షేపణల మధ్యలోనూ జైరాం రమేశ్‌కు ఈనెల 31న నామినేషన్‌ వేస్తారని తెలుస్తోంది.

విధానసభ సంఖ్యా బలం ప్రకారం భాజపా ఇద్దరిని, కాంగ్రెస్‌ ఒకరిని రాజ్యసభకు పంపే వీలుంది. ప్రతి అభ్యర్థికీ కనీసం 45 మంది మద్దతు అవసరం. జేడీఎస్‌కు రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకునే బలం లేదు. భాజపా, కాంగ్రెస్‌ మిగులు ఓట్లను కూడబెట్టుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇటీవల విపక్ష నేత సిద్ధరామయ్య కూడా ఇకపై జేడీఎస్‌తో ఎలాంటి పొత్తు చేసుకోబోమని తెగేసి చెప్పారు. జేడీఎస్‌ మద్దతిస్తే భాజపా మూడో అభ్యర్థిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది.

రాజ్యసభకు ఈనెల 24న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 31తో ముగుస్తుంది. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన, 3న ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ ఎన్నికలను జూన్‌ 10న నిర్వహిస్తుండగా, సాయంత్రమే ఫలితాలు వెల్లడిస్తారు. పార్టీల అంచనా మేరకు విధాన పరిషత్‌ మాదిరిగానే ఈ ఎన్నికలు కూడా ఏకగ్రీవం కానున్నాయి.

కేసీ రామ్మూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని