logo

కొండెక్కిన సేవా సింధు

సేవా సింధు.. 2017లో ప్రారంభమైన ఈ పోర్టల్‌ ప్రభుత్వానికి చెందిన కీలకమైన సేవలకు వేదిక. దాదాపు 1,250కిపైగా సేవలను అందించే సేవా సింధు క్రమంగా ‘సువిధ’, ‘గ్రామ వన్‌’ రాకతో మసకబారింది. ప్రస్తుతం అత్యవసర సేవలకు మాత్రమే పరిమితం చేసిన ‘సేవా సింధు’ను కొత్త అవసరాలకు వినియోగించుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

Published : 24 Jun 2022 01:56 IST

గ్రామవన్‌ విస్తరణతో సరి

ఒక్కొక్క సేవను కోల్పోతున్న పోర్టల్‌

ఈనాడు, బెంగళూరు : సేవా సింధు.. 2017లో ప్రారంభమైన ఈ పోర్టల్‌ ప్రభుత్వానికి చెందిన కీలకమైన సేవలకు వేదిక. దాదాపు 1,250కిపైగా సేవలను అందించే సేవా సింధు క్రమంగా ‘సువిధ’, ‘గ్రామ వన్‌’ రాకతో మసకబారింది. ప్రస్తుతం అత్యవసర సేవలకు మాత్రమే పరిమితం చేసిన ‘సేవా సింధు’ను కొత్త అవసరాలకు వినియోగించుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆలోగా ఈ పోర్టల్‌పై ఆధారపడిన లబ్ధిదారులు గందరగోళానికి గురవటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
* తొలుత వెయ్యికి పైగా సేవలకు లాగిన్‌ పోర్టల్‌గా ఉన్న సేవా సింధు ప్రస్తుతం నాలుగైదు అంశాలకే పరిమితమైంది. బస్‌ పాసులు, పోలీసు కేసుల ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ వంటి పరిమిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇదే తరహాలో ఉన్న ‘సువిధ’ పోర్టల్‌ కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా నగదు చెల్లించేందుకు వినియోగిస్తున్నారు. ఈ రెండు పోర్టల్‌ సేవలపై అవగాహన లేని గ్రామీణులు, విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారానే లాగిన్‌ అవుతూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందే వీలున్న ఈ పోర్టల్‌ సేవలను క్రమంగా తగ్గించటం, ఆ సమాచారంపై అవగాహన లేనివారికి సమయం వృథా అవుతోందన్న వాదన వినిపిస్తోంది.

సాంకేతిక సమస్య..
నాలుగేళ్లుగా సేవలందించిన ఈ పోర్టల్‌ నుంచి ఒక్కో సేవను బదిలీ చేస్తున్న ఈ-గవర్నెన్స్‌ శాఖ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. పాత సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా తొలగించి మళ్లీ కొత్తది అప్‌డేట్‌ చేయటం, సేవల్లో తాజా పాలన నిబంధనలను సవరించటం వల్ల ప్రస్తుతం సేవా సింధుపై ఆధారపడిన లబ్ధిదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు ప్రారంభించి నెల దాటి పోయింది. విద్యార్థులు బస్సు పాసులు పొందాలంటే సేవా సింధు పోర్టల్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడు ఒక మొబైల్‌ సంఖ్యతో పోర్టల్‌లో రిజిస్ట్రర్‌ అయిన వెంటనే వచ్చే ఓటీపీ నిర్ధరణతో బస్సు పాస్‌ సంఖ్యను పొందుతారు. సరిగ్గా ఈ దశలోనే సేవా సింధు సమస్యలు సృష్టిస్తుంది. పిల్లల కోసం నమోదు చేసే ఫోను నంబరు వారి తల్లిదండ్రులదే అవుతుంది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులకు ఒకే ఫోన్‌ నంబరు మాత్రమే ఉంటే ఒక్కరికే పాస్‌ లభిస్తుంది. మిగిలిన ఇద్దరు పిల్లల కోసం పాత ఫోను నంబరు పని చేయకపోవటం ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొనే సర్వసాధారణ సమస్యగా మారింది. పేదింటి తల్లిదండ్రులు ఒక ఫోను నంబరుతోనే సరిపెట్టుకుంటారు. పిల్లల కోసం మరో సిమ్‌ కార్డు తీసుకోవటం కష్టతరంగా మారుతోంది.
* జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామ వన్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 12 జిల్లాల్లో కొత్త పథకాన్ని ప్రారంభించిన సర్కారు క్రమంగా అన్ని జిల్లాలకు ఈ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. సేవా సింధులోని దాదాపు 750 సేవలను గ్రామ వన్‌కు బదిలీ చేశారు. ఇది అన్ని గ్రామాల్లోనూ లేకపోవటమే అసలు సమస్యకు కారణమైంది. మొన్నటి వరకు ‘ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య కర్ణాటక’ బీమా సేవలను సేవా సింధు ద్వారా పొందేవారు. నగరాల్లో స్థిరపడిన వారూ తమ కుటుంబ సభ్యులకు సేవా సింధు ద్వారా బీమా పరిహారం అందించేవారు. ఈ సేవను ప్రస్తుతం గ్రామ వన్‌కు బదిలీ చేయటంతో ప్రతి చిన్న అవసరానికీ గ్రామాలకు వెళ్లాల్సిందే. గ్రామాల్లో ఆ సదుపాయం లేని వారు తాలూకా కార్యాలయాల్లో గంటల కొద్దీ నిలబడాలి. తాజాగా ముఖ్యమంత్రి గ్రామ వన్‌ను అన్ని జిల్లాలకు విస్తరించాలని అధికారులకు సూచించటంతో అందుకు ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సి వస్తోంది.

సమస్య పరిష్కారిస్తాం..
మొబైల్‌ సంఖ్యకు అనుసంధానం చేయకుండా, ఆధార్‌ సంఖ్యతో సేవా సింధును అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనలు పెరిగిపోవటంతో ప్రస్తుతానికి తల్లిదండ్రుల మొబైల్‌ సంఖ్యతో పాటు కుటుంబ సభ్యుల్లో వేరొకరి మొబైల్‌ సంఖ్యతో లాగిన్‌ అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. మొబైల్‌ నంబరు లాగిన్‌ కాని వారికి ఆధార్‌కార్డులోని బొటనవేలు ముద్ర ద్వారా సేవలుపొందే సదుపాయం కల్పిస్తాం. సాఫ్ట్‌వేర్‌లు బదిలీ చేయటం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా అతి తాత్కాలికమే. - పొన్నురాజు, కార్యదర్శి, ఈ గవర్నెన్స్‌

కరోనా సమయంలో కీలకంగా మారిన ‘గ్రామ వన్‌’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని