logo

ఇంటి నుంచే సమీక్షల పరంపర

కొవిడ్‌ బారిన పడడంతో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇంటి నుంచే పని చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయా శాఖల పనితీరును సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. నాలుగు నెలల కిందట

Published : 10 Aug 2022 02:40 IST

వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడుతున్న బొమ్మై

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కొవిడ్‌ బారిన పడడంతో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇంటి నుంచే పని చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయా శాఖల పనితీరును సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. నాలుగు నెలల కిందట విధానసభలో ప్రవేశపెట్టిన పద్దులో కేటాయించిన నిధులు, చేస్తున్న పనులు, ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల జాప్యానికి కారణాలపై ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ సమయంలో మందగతిన సాగిన పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయని గుర్తించారు. పనుల్లో ప్రగతి లేకపోతే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లడం సాధ్యం కాదని పార్టీ హైకమాండ్‌ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని హెచ్చరించింది. కరోనా మహమ్మారి సమయంలో పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం, కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో అన్ని పనులూ మందగతిన సాగాయి. ఈ ఏడాది చివరికి కేటాయించిన నిధుల్లో కనీసం సగం కన్నా ఎక్కువ ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏడాది కావడంతో పనులు నాణ్యతతో వేగంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల వ్యవహారాల బాధ్యులు, సంబంధిత మంత్రులకు సూచించారు. సమన్వయంతో పనులు చేస్తే నాణ్యతను కాపాడవచ్చని హితవుపలికారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు కావడం, జీఎస్టీకి సంబంధించి కేంద్రం నుంచి రావలసిన బకాయిలు విడుదలైన నేపథ్యంలో పనులు చేసేందుకు నిధుల కొరత లేదని బసవరాజ బొమ్మై అధికారులకు స్పష్టం చేశారు. నాలుగు నెలల కిదంట రూ.2,24,432.96 కోట్లతో ముఖ్యమంత్రి పద్దును ప్రవేశపెట్టారు. దానిలో రూ.77,619.48 కోట్ల నిధులను విడుదల చేశారు. జులై చివరి నాటికి రూ.60,586.48 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, అందులో రూ.51965.14 కోట్ల పనులను పూర్తి చేశారు. అన్ని శాఖలు ఇప్పటి వరకు సగటున 21.43 శాతం ఆర్థిక ప్రగతి సాధించాయి. ఆయా శాఖలు, వాటికి కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, ప్రగతి శాతం ఇక్కడ పట్టికలో చూడొచ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని