logo

పంజా విసిరిన చిరుత

చిరుతల దాడులు రాష్ట్రంలో ఎక్కువకావడంతో జనం హడలిపోతున్నారు. టి.నరసీపుర తాలూకా ఎస్‌.కెబ్బేహుండిలో గురువారం రాత్రి ఇంటి వెనుక పెరటిలో బహిర్భూమికి వెళ్లిన మేఘన (22) అనే యువతిపై చిరుత దాడి చేసింది.

Published : 03 Dec 2022 00:37 IST

దాడిలో యువతి మృతి
రాజధానిలో జనం హడల్‌

మైసూరు, న్యూస్‌టుడే : చిరుతల దాడులు రాష్ట్రంలో ఎక్కువకావడంతో జనం హడలిపోతున్నారు. టి.నరసీపుర తాలూకా ఎస్‌.కెబ్బేహుండిలో గురువారం రాత్రి ఇంటి వెనుక పెరటిలో బహిర్భూమికి వెళ్లిన మేఘన (22) అనే యువతిపై చిరుత దాడి చేసింది. ఆమె గొంతు, మొహాన్ని కరిచి గాయపరిచింది. ఆమె వేసిన కేకలకు స్థానికులు అక్కడకు చేరుకునేసరికి ఆ క్రూరజంతువు పారిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోగా మరణించింది. టి.నరసీపుర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పులులు, చిరుత, ఇతర వన్యప్రాణుల సమస్య తీవ్రంగా ఉందని తాము ఇచ్చిన వినతులను అటవీశాఖ అధికారులు బుట్టదాఖలు చేశారని మృతురాలి తండ్రి రమేశ్‌ నాయక్‌ ఆక్రోశించారు.

* ఉద్యాననగరిలో నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయన్న వార్తలు శివారుప్రాంత ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దేవనహళ్లి సమీపంలోని తరబేనహళ్లి ఐటీసీ పరిశ్రమ వద్ద గురువారం అర్ధరాత్రి మరోసారి చిరుత తిరగాడినట్లు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. పరిశ్రమ సమీపంలో ఆహార వ్యర్థాలను తినేందుకు వస్తున్న జాగిలాల కోసమే చిరుత వచ్చిందని అనుమానిస్తున్నారు. ఆ పరిశ్రమ వెనుక 20 ఎకరాలలో చిరు అడవి విస్తరించింది. రాత్రుళ్లు అక్కడ చిరుత తలదాచుకుందని అటవీశాఖ అధికారులు అంచనాకు వచ్చారు.

* బెంగళూరు ఉత్తరహళ్లి పరిధిలో పలు ధార్మిక సంస్థలు ఆశ్రమాలను నిర్మించుకున్నాయి. ఆ ప్రాంతంలోనూ చిరుతల భయమే. బన్నేరుఘట్ట, రామనగర అటవీ విభాగం చేరువలో ఉండడంతో అక్కడకు నాలుగు చిరుతలు వచ్చాయని భావిస్తున్నారు. దేవనహళ్లి, నంది బెట్ట, చిక్కబళ్లాపుర పరిధిలోనూ అటవీ నిర్మూలన శరవేగంగా కొనసాగుతోంది. విల్లాలు, ఐటీ పార్కుల నిర్మాణం కోసం నంది బెట్ట సానువుల్లో ఇప్పటికే పచ్చదనం కరవైంది. ఇప్పటి వరకు అక్కడ తలదాచుకున్న వన్యప్రాణులే ఇప్పుడు నగరం శివార్లలోకి వస్తున్నాయని అనుమానిస్తున్నారు. తరబేనహళ్లి సమీపంలోని కల్యాణ మండపం వద్ద గురువారం ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుత ఉందన్న ప్రచారంతో ఆశించిన దాని కన్నా తక్కువ మంది అక్కడకు వచ్చారు. ఉత్తరహళ్లి, తురహళ్లి విభాగాలలోనూ శుక్రవారం ఉదయం వ్యాహ్యాళికి వచ్చిన వారి సంఖ్య తక్కువగా కనిపించింది. చిరుతలు కనిపించిన అన్ని ప్రాంతాలలో అటవీశాఖ సిబ్బంది బోనులు ఏర్పాటు చేసి, వాటి కోసం గాలింపు తీవ్రం చేశారు.

చిక్కకపోతే.. కాల్చేయడమే

మైసూరు, న్యూస్‌టుడే : టి.నరసీపుర వద్ద మేఘన అనే యువతిని చంపిన చిరుతను పట్టుకునేందుకు 15 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. మత్తు మందు ఇచ్చి దాన్ని పట్టుకోవడం సాధ్యం కాకపోతే కాల్చివేస్తామని డీసీఎఫ్‌ మాలతి ప్రకటించారు. అటవీ శాఖ తరఫున యువతి కుటుంబానికి రూ.5 లక్షలు శుక్రవారం అందించారు. మరణోత్తర పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత మరో రూ.2.5 లక్షల పరిహారాన్ని ఇస్తామని తెలిపారు. సరిహద్దుల్లోని గ్రామాలలోకి వన్యప్రాణులు రాకుండా అటవీ శాఖ సిబ్బంది అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని