logo

అదాని పేరిట నిలువునా మోసం

కేంద్ర ప్రభుత్వం భారతీయ స్టేట్ బ్యాంకు, భారతీయ జీవిత బీమా సంస్థలతో అదాని గ్రూపులో బలవంతంగా మదుపు చేయించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Published : 07 Feb 2023 01:48 IST

అదాని, మోదీ, నిర్మలా సీతారామన్‌ మాస్కులు ధరించిన కాంగ్రెస్‌ కార్యకర్తల ధర్నా

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం భారతీయ స్టేట్ బ్యాంకు, భారతీయ జీవిత బీమా సంస్థలతో అదాని గ్రూపులో బలవంతంగా మదుపు చేయించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. పాత మైసూరు బ్యాంకు కూడలిలో పార్టీ కార్యాధ్యక్షుడు రామలింగారెడ్డి నేతృత్వంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ధర్నా, నిరసన ప్రదర్శనకు దిగారు. ఎల్‌ఐసీతో రూ.36 వేల కోట్లు మదుపు చేయించగా, ఎస్‌బీఐ నుంచి రూ.80 వేల కోట్లు రుణాలు ఇప్పించి, ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్రధానమంత్రి మోదీ అవకాశం కల్పించారని విమర్శించారు.

పేదల సమస్యలను గాలికి వదిలి, పెట్టుబడిదారులు తీసుకున్న రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయించడం వెనుక భారీ కుట్ర జరిగిందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టి, శ్రీమంతులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని రామలింగారెడ్డి ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలకు అనుగుణంగా ప్రధాన న్యాయమూర్తి లేదా, విశ్రాంత న్యాయమూర్తులతో దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండు చేశారు. కర్ణాటకలో భాజపా అనగానే యడియూరప్ప పేరు గుర్తుకు వస్తుందని, ఆయనను పక్కకు పెట్టి, అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. గుత్తేదారుల నుంచి 40 శాతం కమీషన్‌, బిట్కాయిన్‌ లావాదేవీలు, బదిలీల పేరిట పెద్ద మొత్తంలో లంచాలు స్వీకరణ తదితర అంశాలలోనూ దర్యాప్తు అవసరం అన్నారు. తమ ప్రజాధ్వని టైర్లు పంక్చర్‌ అవుతాయని అనుకోవడం భ్రమ అని, తమవి విమానం టైర్లని పేర్కొన్నారు. మోదీ, నిర్మలా సీతారామన్‌, గౌతమ్‌ అదాని తరహాలో మాస్కులు ధరించిన కొందరు ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జి.శేఖర్‌, కృష్ణప్ప, మంజునాథ రెడ్డి, ఉదయ్‌శంకర్‌, గంగాంబికె తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని