logo

కులాల మధ్య భాజపా చిచ్చు

ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఒక్కలిగరు, పంచమసాలి లింగాయతులు, వీరశైవులు, మైనార్టీ వర్గాల రిజర్వేషన్‌ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలను మోసగించిదని కాంగ్రెస్‌ నేతలు ఆక్రోశం వ్యక్తం చేశారు.

Published : 27 Mar 2023 02:24 IST

నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న
కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకేశివకుమార్‌, రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, తదితరులు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఒక్కలిగరు, పంచమసాలి లింగాయతులు, వీరశైవులు, మైనార్టీ వర్గాల రిజర్వేషన్‌ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలను మోసగించిదని కాంగ్రెస్‌ నేతలు ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రకటించిన రిజర్వేషన్ల అశాస్త్రీయంగా ఉన్నాయని విరుచుకుపడ్డారు. ఆదివారం కాంగ్రెస్‌భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్‌, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, తదితరులు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ రద్దు చేసి పంచమసాలి లింగాయతులు, ఒక్కలిగరుకు కట్టపెడుతూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్‌ భిక్ష కాదని, ఒక్కలిగరు, పంచమసాలి లింగాయతులకు భిక్షం అవసరం లేదని, ఒక్కరికి ఉన్న హక్కును లాక్కుని దాన్ని ఇతరులకు కట్టపెట్టడం ద్వారా సమాజంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు భాజపా పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఆయా వర్గాల జనసంఖ్యకు అనుగుణంగా హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రిజర్వేషన్‌ అంశంపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పరిశీలించకుండా అశాస్త్రీయ తీర్మానం చేశారని ధ్వజమెత్తారు. తెచ్చిన రిజర్వేషన్‌ అంగీకరించాలని మఠాధిపతులు జయ మృత్యంజయ స్వామి, నిర్మలానంద నాథ్‌ స్వామికి భాజపా నేతలు ఫోన్‌ చేసి వేడుకున్నారని తెలిపారు. విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని, అధికారంలోకి వచ్చిన తరువాత అన్నివర్గాలతో చర్చించి రిజర్వేషన్ల పెంపుదల వర్గీకరణ తదితర వాటిని చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాల మాట్లాడుతూ మహాభారతంలో శకుని పాత్రను ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పోషిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఉద్దేశపూర్వకంగా దళిత, వెనకబడిన, మైనార్టీ వర్గాలను మోసగిస్తున్నారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏరాష్ట్రం మూడునెలల్లో రిజర్వేషన్‌ మార్పులు, చేర్పులపై ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు. రిజర్వేషన్‌ పెంపుదల, కేటాయింపు, తదితర అంశాలు న్యాయస్థానం విచారణలో ఉందనే అంశాన్ని భాజపా పాలకులు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల రిజర్వేషన్‌లోని నాలుగు శాతం రిజర్వేషన్‌ను మైనార్టీలకు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించిందని, కేవలం ఆర్థికంగా వెనకబడిన వారికి ఉన్న రిజర్వేషన్‌, మైనార్టీలకు కేటాయించడం సాధ్యమా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో చేయలేని పనులను ఎన్నికలు దగ్గర పడుతుండగా చేయడం ఓట్ల రాజకీయాలకు భాజపా పాలకులు తెర తీశారన్నారు. రిజర్వేషన్‌లపై గందరగోళం సృష్టించి, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.


కాంగ్రెస్‌ ఆందోళన

స్వతంత్ర ఉద్యానవనంలో చేతులకు నల్లరిబ్బన్లు కట్టుకుని ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రాజకీయంగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీని ఎదుర్కొవడం చేతకాక వామమార్గాల్లో లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని  ఆరోపిస్తూ ఆదివారం సాయంత్రం నగరంలోని స్వతంత్ర ఉద్యానవనంలో కాంగ్రెస్‌ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు చేతులకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ దేశంలో నియంత్రుతత్వ ధోరణి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వ్యక్తుల గొంతులు నొక్కివేసి జైళ్లకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతులు లేకుండా చేసేందుకు, రాహుల్‌గాంధీని లోక్‌సభలో అడుగుపెట్టకుండా కుట్ర పన్ని అమలు చేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడలిపెట్టు అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం ఇవ్వలేక జారుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అదానీ- ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, ఎగువ సభలో ప్రతిపక్ష నేత బీకేహరిప్రసాద్‌, మాజీ మంత్రులు దినేశ్‌గుండూరావు, కేజేజార్జి, రామలింగారెడ్డి, కేపీసీసీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని