logo

లాడ్జిలో దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 29 Mar 2024 03:04 IST

ఆధార్‌కార్డుల సాయంతో గుర్తింపు

మడికెరి, నిజామాబాద్‌, న్యూస్‌టుడే : నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేడవరపు రాజు (55), మేడవరపు స్వాతి (54) కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌ నగరానికి వలస వచ్చారు. గాయత్రినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం లేక మానసికంగా కుంగిపోయారు. పైగా వీరికి సరైన ఉపాధి లేక అప్పులపాలయ్యారు. అవి తీర్చే మార్గం లేక నాలుగేళ్ల కిందట నగరాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక్కడ బంధువులు ఎవరూ లేకపోవడంతో వారు ఎటు వెళ్లారో తెలియదు. బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆధార్‌ కార్డుల్లో చిరునామా గుర్తించిన కర్ణాటక పోలీసులు నిజామాబాద్‌ అధికారులకు సమాచారం అందించారు. వీరు రెండున్నర నెలలుగా లాడ్జిలోనే ఉంటున్నారని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించేవారని లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరి వివరాలు సేకరించేందుకు గాయత్రినగర్‌కు వెళ్లగా లభ్యం కాలేదని నాలుగో ఠాణా ఎస్సై సంజీవ్‌ తెలిపారు.


ప్రాణం తీసిన తాగునీటి రగడ

యాదగిరి, న్యూస్‌టుడే : తాగునీటి కోసం ఇరుగు పొరుగున ఉంటున్న వారి మధ్య మొదలైన గొడవ నందకుమార్‌ కట్టిమని అనే యువకుని హత్యతో ముగిసింది. హుణసగి పట్టణంలో కుళాయి వద్ద నీరు పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో నందకుమార్‌ నాయనమ్మతో పొరుగింటి వారు గొడవ పెట్టుకున్నారు. వారిని వారించేందుకు వెళ్లిన సమయంలో పొరుగింటిలో ఉంటున్న హనుమంత అనే యువకుడు అతనిపై కత్తితో దాడి చేసి పొడిచి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు. హుణసగి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఆకతాయి చేష్టలకు యువకుడు బలి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఓ వ్యక్తి విచిత్ర చేష్టలు ఓ నిండుప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఓ యువకుడి మలద్వారం వద్ద గాలి గొట్టం (ఎయిర్‌ ప్రెజర్‌ పైప్‌) బలవంతంగా అమర్చి, గాలి వదలడంతో అధిక ఒత్తిడికి పొట్ట పగిలిపోయింది. ఆ యువకుడు తుదకు ఊపిరి వదలిన సంఘటన బెంగళూరు వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ చేష్టకు పాల్పడిన మురళి అనే వ్యక్తిని సంపిగేహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని థణిసంద్రకు చెందిన యోగేశ్‌ (24) అనే యువకుడు ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో ఉద్యోగి. ఆ యువకుడి సోదరి పెళ్లి ఏప్రిల్‌లో నిర్వహించాలని నిర్ణయించి పనుల్లో తీరిక లేకుండా తిరిగేవాడు. సోమవారం సాయంత్రం థణిసంద్ర సీఎన్‌ఎస్‌ కార్‌ సర్వీస్‌ కేంద్రానికి ఓ పని నిమిత్తం వెళ్లాడు. అక్కడే తన స్నేహితుడి ద్విచక్రవాహనాన్ని మరమ్మతుల కోసం ఇచ్చారు. అక్కడ పని చేస్తున్న మురళితో యోగేశ్‌కు స్నేహం ఉండేది. ఇద్దరూ మాటల్లో పడిపోయారు. నిక్కరు వేసుకుని ఓ బల్లపై కూర్చున్న యోగేశ్‌ పరధ్యానంలో ఉన్న సమయంలో మురళి బలవంతంగా గాలిగొట్టాన్ని జొప్పించాడని పోలీసులు గుర్తించారు. అనూహ్య పరిణామం నుంచి తప్పించుకోలేక పోయాడు. వేగంగా అధిక ఒత్తిడితో గాలి శరీరంలోకి ప్రవేశించడంతో పొట్ట పగిలింది. పేగులు బయటకు వచ్చేయడంతో పడిపోయాడు. అక్కడున్న కొందరు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్సతో బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. గురువారం తెల్లవారు జామున యోగేశ్‌ మరణించినట్లు పోలీస్‌ అధికారులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


మహిళా విలేకరిపై దాడి

రామనగర, న్యూస్‌టుడే : బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేశ్‌ నామపత్రాన్ని దాఖలు చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పీటీఐ పాత్రికేయురాలిపై ఏఎన్‌ఐ పాత్రికేయుడు దాడి చేశాడు. ఆమెను దూషిస్తూ, అందరి ముందూ కొట్టాడు. పక్కనే ఉన్న ఇతర పాత్రికేయులు అడ్డుకునేలోగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పీటీఐ ప్రతినిధులు తెలిపారు.


ఆర్నబ్‌ గోస్వామిపై ఫిర్యాదు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణపై రిపబ్లిక్‌ టీవీ నిర్వాహకుడు ఆర్నబ్‌ గోస్వామి, ఆర్‌.కన్నడ టీవీ సంపాదకుడు నిరంజన్‌పై బెంగళూరు ఎస్‌.జె.పార్క్‌ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న సాయంత్రం ఎంజీ రోడ్డుపై ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వేళ ఓ అంబులెన్స్‌ నిలిపి, సంచారానికి ఆటంకం కలిగించారంటూ ఓవ్యక్తి తీసిన వీడియోను ఆర్‌.కన్నడ టీవీలో ప్రసారం చేశారు. నిజానికి ఆ సమయంలో ముఖ్యమంత్రి మైసూరులో ఉన్నట్లు పీసీసీ న్యాయ విభాగం కార్యదర్శి రవీంద్ర గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో అసలైనదా? కాదా? అని పరీక్షించకుండా ఇలా ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేలా వార్త ప్రసారం చేయడం దారుణమంటూ తప్పుపట్టారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


విద్యార్థిని దుర్మరణం

బాగలకోటె, న్యూస్‌టుడే : కదులుతున్న బస్సు నుంచి కిందకు దిగే ప్రయత్నంలో తలకు తీవ్రగాయాలై సృష్టి మాదర (9) అనే విద్యార్థిని గురువారం మరణించింది. బీళగి తాలూకా టక్కళగికి చెందిన విద్యార్థిని బస్సు ఆగక ముందే తలుపు తీసుకుని కిందకు దిగుతూ పడిపోయింది. బీళగి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


దొరికిపోయిన రక్షకులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చేతన్‌ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న పీణ్య ఠాణా హెడ్‌ కానిస్టేబుల్‌ గంగహనుమయ్య, జీపు డ్రైవరు నాగరాజ్‌లను లోకాయుక్త అధికారి విజయకృష్ణ నేతృత్వంలో పట్టుకున్నారు. గ్యాసు సిలిండర్‌ గోదాము ప్రారంభించేందుకు సుంకదకట్టె మారుతినగరకు చెందిన చేతన్‌ అనే వ్యక్తికి అనుమతి పత్రాన్ని ఇచ్చేందుకు వీరు లంచం డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు లోకాయుక్తకు ఉప్పందించడంతో అధికారులు దాడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని