logo

పట్టాలపై కడతేరిన కష్టజీవులు

ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్‌ సమీపాన విషాదాన్ని నింపింది.

Updated : 26 Apr 2024 02:39 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్‌ సమీపాన విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నా.. గురువారం ఉదయం వారి మరణ సమాచారం వెలుగు చూసింది. మారతహల్లి రైల్వే వంతెన వద్ద ఆ ముగ్గురి శవాలూ గుర్తించామని రైల్వే పోలీసులు వివరించారు. మృతులను ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన శశికుమార్‌ (23), లోకేశ్‌ (25), బాలసుబ్రహ్మణ్యం (24)గా గుర్తించారు. వారు ఉపాధి కోసం రాజధానికి చేరుకుని ఇలా తనువు చాలించారు. ఆత్మహత్యా? రైలు ప్రమాదమా? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. వారంతా కణ్ణూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడున్నాయి. ‘ఆ ముగ్గురూ రైల్వేస్టేషన్‌ సమీపాన చెవుల్లో సెల్‌ఫోన్‌ హెడ్‌ఫోన్లు పెట్టుకుని నడుస్తుంటే పోలీసులు మందలించారు. అక్కడి నుంచి యువకులు దూరంగా వెళ్లిపోయినట్లు గుర్తించాం. ఉదయం చూస్తే.. ఆ ముగ్గురూ చనిపోయారు’ అని మల్లేశ్‌ అనే స్థానికుడు వివరించాడు. అటు- ఇటు ఉన్న నివాస ప్రాంతాల వారు రైలుపట్టాలను దాటడానికి నడచి వెళ్లడం ఆ ప్రాంతంలో ఎక్కువ. అదే చోట వారు మరణించారు. పట్టాలు దాటుతూ ప్రమాదంలో చిక్కి ఉంటారనీ అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని