logo

ఆమె ప్రాతినిధ్యం..అంతంత మాత్రం!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు.

Published : 01 May 2024 02:29 IST

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీకి దూరంగా మహిళలు
బసవరాజేశ్వరి హ్యాట్రిక్‌ విజయం

బళ్లారి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. ఓటర్ల సంఖ్యలో సింహభాగం వారే ఉన్నా..పోటీలో మాత్రం వెనుకబడ్డారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో కేంద్ర మాజీ మంత్రి బసవరాజేశ్వరి, భాజపా అగ్రనేత్రి, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బళ్లారి జిల్లాలో భాజపాకు గట్టి పునాది వేసిన సుష్మాస్వరాజ్‌, మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి జె.శాంతల పోటీతో అందరి దృష్టిని ఆకర్షించిన బళ్లారి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మహిళల పోటీలేకుండానే ఎన్నిక జరుగనుంది. జాతీయ పార్టీలతో పాటు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల నుంచి పురుషులే పోటీలో నిలిచారు.

మేటి నాయకురాళ్లు పోటీ చేసిన గడ్డ

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 17 సార్వత్రిక, రెండు ఉప ఎన్నికలు కలిపి మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి మొదటి సారిగా 1984లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన బసవరాజేశ్వరి ఒక్కరే బరిలో నిలిచారు. ఎన్నికల్లో గెలిచి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఆమె వరుసగా 1984, 1989, 1991లో గెలుపొందారు. కేంద్రంలో ప్రధాని పి.వి.నరసింహారావు మంత్రి వర్గంలో కేంద్ర మహిళ-శిశు అభివృద్ధి మంత్రిగా పనిచేశారు. అనంతరం 1996, 1998లో జరిగిన ఎన్నికల్లో మహిళలు పోటీకి దూరంగా ఉండిపోయారు. 1999లో దేశ, అంతర్జాతీయ స్థాయిలోనే ఈ స్థానానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అగ్రనేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి సుష్మాస్వరాజ్‌ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ 56,100 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గెలిచినా అమేథికి పరిమితం కావడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గౌసియా బేగం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 10,306 ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2009లో భాజపా నుంచి జె. శాంత పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. 2018 ఉప ఎన్నికల్లో జె.శాంత భాజపా అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వి.ఎస్‌.ఉగ్రప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో 12 మంది బరిలో నిలిచినా మహిళలు లేకపోవడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో అదే పునరావృతం అయింది.

మహిళా ఓటర్లే అధికం

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్‌ అయింది. ఈ స్థానం పరిధిలోకి ఎనిమిది విధానసభ నియోజకవర్గాలు వస్తాయి. ఏప్రిల్‌ 4 వరకు 18 ఏళ్ల పైబడిన వారు ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 18,77,751 మంది ఓటర్లు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 9,51,522 మంది, పురుషులు 9,25,961 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 25,561 మంది ఎక్కువగా ఉన్నారు. అయినా ఈసారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒక్క మహిళా అభ్యర్థి పోటీ చేయలేదని లెక్కలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని