logo

యాప్‌ల వలలో విలవిల

పబ్జీ, బెట్టింగ్‌ యాప్‌ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Published : 01 May 2024 02:30 IST

నిందితుల నుంచి జప్తు చేసుకున్న నగదును పరిశీలిస్తున్న కొత్వాలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : పబ్జీ, బెట్టింగ్‌ యాప్‌ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గంగావతికి చెందిన కార్తిక్‌ కుమార్‌ (42), సునీల్‌ (30), రాజరాజేశ్వరినగర నివాసి వెమన్‌ (19), కెంగేరి ఉపనగర నివాసి వివేక్‌ (19)లను నిందితులుగా గుర్తించారు. ఆభరణాలను కరిగించిన ముద్దగా చేసిన 302 గ్రాముల బంగారం, రూ.23.50 లక్షల నగదుతో కలిపి రూ.41.50 లక్షల సొత్తు వీరి నుంచి జప్తు చేసుకున్నామని నగర పోలీసు కమిషనర్‌ బి.దయానంద్‌ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఐడియల్‌ హోమ్స్‌లో ఉంటున్న ఒక విద్యార్థి చెడు అలవాట్ల బారిన పడ్డాడు. బెట్టింగ్‌ యాప్‌లలో పెద్ద మొత్తాన్ని కోల్పోయాడు. మరో స్నేహితుడి ఇంటి నుంచి సుమారు 600 గ్రాముల ఆభరణాలను దొంగిలించి తీసుకురమ్మని, వాటిని తాకట్టు పెట్టి నగదు చేసుకుని, పందేలు కొనసాగించాడు. వారి బలహీనతను అడ్డుపెట్టుకున్న నిందితులు ఆభరణాలు తీసుకుని, తక్కువ మొత్తాన్ని ఆ విద్యార్థులకు ఇచ్చారు. ప్రతిసారీ వారిద్దరి ఇళ్ల నుంచి నగదు, బంగారాన్ని తీసుకురమ్మని బెదిరిస్తూ వచ్చారు. తమ నివాసంలో బంగారం దొంగతనమైన విషయాన్ని గుర్తించిన ఒక విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు విచారణలో ఇద్దరు విద్యార్థులూ ఈ నగలను తాకట్టు పెట్టారని గుర్తించారు. నగలు తాకట్టు పెట్టుకుని, బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేశామని దయానంద్‌ తెలిపారు. సమావేశంలో పోలీసు అధికారులు సతీశ్‌ కుమార్‌, రమణ గుప్త, చంద్రగుప్త తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని