logo

ఓటంటేనే వారికి ప్రాణం!

ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్‌ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్‌ బూత్‌ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు.

Published : 08 May 2024 02:47 IST

హావేరి : పసిబిడ్డలతో వచ్చిన బాలింతలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్‌ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్‌ బూత్‌ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు. హుబ్బళి సమీపంలోని నూల్వి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 69 మంది పోలింగ్‌ బూత్‌కు ఒకేసారి వచ్చి ఓటు వేసి వెళ్లారు. సవదత్తి తాలూకా ఆలదకట్టి గ్రామ పంచాయతీలోని పోలింగ్‌ బూత్‌లో పారా ఒలింపిక్‌ క్రీడాకారిణి లక్ష్మీ రాయప్ప చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసి వెళ్లారు. విజయపుర లోక్‌సభ పరిధిలోని హెబ్బాళ, యలగూర, బీరలదిన్ని, బళబట్టి గ్రామాల్లో నరేగా పనులు చేస్తున్న 256 మంది కార్మికులు ఓటు వేసి అనంతరం తమ పనులకు హాజరయ్యారు. బళ్లారి, ఉత్తర కన్నడ జిల్లాల్లోని కొన్ని పోలింగ్‌ బూత్‌లకు విధి నిర్వహణకు వచ్చిన కొందరు సిబ్బంది అతి ఉష్ణోగ్రతలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే, భార్య శ్రీరూపతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శిరసి కేహెచ్‌బీ కాలనీలో అందరితో పాటు వరుసలో నిలబడి బూత్‌లోకి వచ్చారు.

దావణగెరరె: రైతుల కోసం సస్య పోలింగ్‌ బూత్‌

కొన్నేళ్లుగా ధార్వాడ నగరంలోకి ప్రవేశించకుండా ఉన్న నిర్బంధాన్ని ఓటు వేసేందుకు ఉన్నత న్యాయస్థానం తొలగించడంతో ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణి నగరంలోకి వచ్చారు. భార్య శివలీల, కుమార్తె వైశాలితో కలిసి వచ్చి ఓటు వేసి వెళ్లారు. వినయ్‌ నగరంలోకి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చి పలకరించి వెళ్లారు. ధార్వాడ జిల్లా నవలగుంద ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసోటి అందరితో పాటు వరుసలో నిలబడి ఓటు వేశారు. హావేరిలో పది మందికిపైగా తల్లులు తమ చంటి బిడ్డలను ఎత్తుకుని వచ్చి ఓటు వేసి వెళ్లారు. చిన్నారులు పాలు తాగేవారు కావడంతో, వారిని ఇళ్ల వద్ద ఒంటరిగా విడిచి వెళ్లలేక, పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చామని బాలింతలు తెలిపారు. హావేరిలో ఒక బూత్‌ వద్ద మొక్క జొన్న కండెలు, కొబ్బరి పీచుతో చేసిన ఉత్పత్తులతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. వాననీటి సంరక్షణకు సంబంధించిన జాగృతిని తెలిపే నమూనాలను దావణగెరెలోని ఒక బూత్‌లో అందుబాటులో ఉంచారు. దావణగెరె జాలినగర జనతావిద్యాలయంలో పర్యావరణ స్నేహి ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్వారలో రెండు కాళ్లు లేని నాగప్ప యోగప్ప (62) అనే వ్యక్తి కృత్రిమ కాళ్లు ధరించి పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఒక యువతి కూడా బ్యాండేజ్‌ ధరించి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంది. శివమొగ్గ, కార్వారలలో కొన్ని బూత్‌లలో ఈవీఎంలు కొంత సమయం మొరాయించాయి. దీంతో ఒక గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు