logo

చిన్నఉద్యోగమైనా చేతివాటమే

జిల్లావ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఏళ్లుగా ఖాళీలుగా ఉన్న బోధనేతర సిబ్బంది భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆయా ఉత్తర్వులు ఈ నెల 17న వెలువడ్డాయి. జిల్లాలోని మొత్తం 14 విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఎంఈవో కార్యాలయంలో

Published : 28 Jan 2022 05:14 IST
కేజీబీవీల్లో బోధనేతర పోస్టుల భర్తీ నేపథ్యంలో ఆరోపణలు
పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం

మండలంలోని విద్యాలయంలో అటెండర్‌ పోస్టును రూ.లక్ష ముట్టజెబితే ఇప్పిస్తానంటూ మధ్యవర్తి ఒకరు స్థానిక ఎంఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఆశావహులను నమ్మిస్తున్నారు. కొందరు ఎంతో కొంత ఆయనకు ముట్టజెప్పినట్లు సమాచారం.


రో మండలంలో వంట మనిషి పోస్టు ఇప్పించేందుకు రూ.50 వేలకు ఎంఈవో కార్యాలయానికి చెందిన ఒక మధ్యవర్తితో ఒప్పందం చేసుకున్నట్లు అభ్యర్థి చెబుతున్నాడు. ఇంకెవరికైనా ఇతర పోస్టుల్లో ఆసక్తి ఉంటే చెప్పాలని తనతో ఆన్నట్లు సదరు దరఖాస్తుదారుడు సన్నిహితులకు చెప్పాడు.


జిల్లావ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఏళ్లుగా ఖాళీలుగా ఉన్న బోధనేతర సిబ్బంది భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆయా ఉత్తర్వులు ఈ నెల 17న వెలువడ్డాయి. జిల్లాలోని మొత్తం 14 విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఎంఈవో కార్యాలయంలో ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. చిన్నస్థాయి ఉద్యోగాలు కావడంతో వాటికి ఆమ్యామ్యాలు ఇచ్చుకునే వారికి అడ్డదారుల్లో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కొందరు ఆశావహులు బేరసారాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పదుల సంఖ్యలో పోస్టులుంటే వందల్లో దరఖాస్తులు రావడాన్ని బట్టిచూస్తే డిమాండ్‌ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు విధి విధానాలు వెల్లడించకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

మొత్తం ఖాళీలు

ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, చంద్రుగొండ, దుమ్ముగూడెం, గుండాల, కరకగూడెం, ములకలపల్లి, పాల్వంచ, పినపాక, టేకులపల్లి, కొత్తగూడెం మండలాల్లోని కేజీబీవీల్లో 43 పోస్టుల భర్తీకి 1,119 దరఖాస్తులు అందాయి. వీటిల్లో కాపలాదారు, స్వీపర్‌, ప్రధాన వంట మనిషి, సహాయ వంట మనిషి, అటెండర్‌ పోస్టులున్నాయి. ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దార్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని డీఈవో ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు ప్రధాన వంట మనిషి ఎంపిక విధానంపై మాత్రమే స్పష్టత వచ్చింది. ఈ పోస్టుకు వంట నిర్వహణ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని తీసుకోనున్నారు. మిగతా వారి ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు.


పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
- సోమశేఖర్‌శర్మ, డీఈవో

కేజీబీవీల్లో ఖాళీలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించాం. ఎలాంటి అవకతవకలు జరిగినా చివరకు జిల్లా పాలనాధికారి వద్దకు వెళ్తుంది. ఆయన పరిశీలించాకే ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారమే తీసుకుంటాం. ఎక్కడైనా ఆరోపణలు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని