logo

రెండంచల వ్యూహం

వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చట్టాలున్నా వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో ఎక్కడో ఓచోట వేట కొనసాగుతూనే ఉంది. వేటగాళ్ల క్రూరత్వానికి ప్రాణులు బలవుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులు

Published : 19 May 2022 05:04 IST

 వన్య ప్రాణుల సంరక్షణకు కట్టుదిట్ట చర్యలు

అశ్వాపురం, న్యూస్‌టుడే : వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చట్టాలున్నా వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో ఎక్కడో ఓచోట వేట కొనసాగుతూనే ఉంది. వేటగాళ్ల క్రూరత్వానికి ప్రాణులు బలవుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులు కూడా చనిపోతున్నారు. వేటగాళ్ల అకృత్యానికి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు.

* చుంచుపల్లి మండలం పెనుబల్లిలో స్నేహితులతో కలిసి అడవికి వెళ్లిన కొత్తగూడేనికి చెందిన ఒకరు ఇటీవల శవంగా తేలాడు. అడవిలో వన్యప్రాణుల వేట కోసం అప్పటికే అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఎక్కడ గుట్టు రట్టవుతుందోనని భయపడి ఏకంగా మృతదేహాన్నే మాయం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ ఘటన జరిగింది. 

* ములకలపల్లి మండలంలోని మొగురాలగుప్పలో అడవికి వెళ్లి వన్య ప్రాణుల కోసం అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన గతేడాది చోటుచేసుకుంది. 

* అశ్వాపురం మండలంలోని వెంకటాపురంలో ఓ రైతు ఈ ఏడాది మార్చిలో తన పొలానికి కాపలా కోసం రాత్రివేళ వెళ్లాడు. మార్గంమధ్యలో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకున్నా పరిస్థితి దుర్భరంగా మారింది. 

వన్య ప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీ శాఖ రెండంచెల వ్యూహాన్ని అమలుపరుస్తోంది. 

వేటగాళ్లు వెళ్లకుండా..
వేటగాళ్లు అడవులోకి వెళ్లకుండా గ్రామాల్లో పటిష్ఠ ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను అభివృద్ధి చేశారు. వారు గ్రామాల్లో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండరు. అనుమానితుల పేర్లు, వివరాలతో జాబితాలను రూపొందించారు. వారి ప్రతి కదలికలపై గట్టి నిఘా పెట్టారు. అడవుల్లో క్రమం తప్పకుండా పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఉచ్చులను, విద్యుత్తు తీగలను తొలగిస్తున్నారు. అమర్చినవారి గురించి ఆరాలు తీసి కేసులు నమోదు చేస్తున్నారు.

వెలుపలికి రాకుండా..

వన్య పాణులు అడవుల నుంచి వెలుపలికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా తాగునీటి కోసం బయటకు వస్తుంటాయి. అడవుల్లోనే జంతువుల దాహార్తిని తీర్చేందుకు సహజసిద్ధ నీటి ప్రవాహాలు, కుంటలు, చెరువులు సుమారు 391 విశేషంగా అభివృద్ధి చేశారు. కృత్రిమంగా చెక్‌డ్యామ్‌లు, వూరచెరువులు, సోలార్‌ పంపులు, సాసర్లు తదితరాలను మరో 1377 ఏర్పాటుచేశారు.

వేట.. మూడు పద్ధతుల్లో..
1. వేటగాళ్లు అడవుల్లోకి రాత్రివేళల్లో శక్తివంతమైన లైట్లు, వేటకుక్కలతో వెళ్తారు. వన్యప్రాణి కనబడగానే దాని కళ్లలోకి లైట్లు వేస్తారు. అది తేరుకునేలోగా పదునైన బరిశెలు, ఈటెలతో దాన్ని పొడిచి చంపుతారు. 
2. వన్య ప్రాణులు దాహార్తిని తీర్చుకోవడం కోసం అందుబాటులో ఉన్న నీటి వనరుల వద్దకు వస్తాయి. ఆ ప్రాంతాల్లో ఉచ్చులు పన్నుతారు. వాటిల్లో చిక్కుకుని మృతి చెందుతాయి. 
3. అడవుల్లో నుంచి పలుచోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్తు తీగలు అమర్చుతారు. వన్య ప్రాణులు తీగలకు తగిలి మృతి చెందుతాయి. అమాయకులు కూడా ప్రాణాలను కోల్పోతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని