logo

నగరానికి తాగునీరు విడుదల

వేసవిలో ఖమ్మం నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ కాలువ ద్వారా తాగునీటిని విడుదల చేశారు. ఖమ్మం నగర ప్రజలకు తాగునీరు

Published : 19 May 2022 05:47 IST

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వేసవిలో ఖమ్మం నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ కాలువ ద్వారా తాగునీటిని విడుదల చేశారు. ఖమ్మం నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు మున్నేరు నదిలోకి 35 ఎంసీఎఫ్‌టీలు, లకారం చెరువులోకి 10 ఎంసీఎఫ్‌టీల నీరు సరఫరా చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన నీరు ఖమ్మం రూరల్‌ మండలం దానవాయిగూడెం వద్ద ఎస్కేప్‌ లాకుల నుంచి మున్నేరు నదిలోకి చేరతాయి. ఇందిరానగర్‌, టేకులపల్లి మధ్య సాగర్‌ ప్రధాన కాలువలో మట్టితో అడ్డుకట్ట నిర్మించారు. అక్కడున్న ఖమ్మం మేజర్‌-2 కాలువ ద్వారా లకారం చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఖానాపురం హవేలి ఫ్లోరైడ్‌ రహిత తాగునీటి పథకానికి లకారం చెరువు నుంచి నీటిని అందిస్తారు. ఇందుకోసం 10 ఎంసీఎఫ్‌టీల నీరు పాలేరు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. 
ఏటా అడ్డుకట్టతో ఇక్కట్లు: టేకులపల్లి వద్ద సాగర్‌ ప్రధాన కాలువలో మట్టితో అడ్డుకట్ట నిర్మాణానికి నగర పాలక సంస్థ అధికారులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ అడ్డుకట్ట కడితేనే ఖమ్మం మేజర్‌-2 కాలువ తూముకు నీరు అందుతుంది. ఈ తూము ద్వారానే లకారం చెరువుకు నీరు చేరుతుంది. ఖరీఫ్‌ సీజన్‌లో సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే సమయంలో ఇక్కడ అడ్గుగా ఉన్న మట్టి కట్టను నగర పాలక సంస్థ అధికారులు అలాగే వదిలేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కొంత మేర మట్టి కట్టను తొలగిస్తున్నారు. మిగతా మట్టి అంతా కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ కాలువలో పూడిక పేరుకుపోతోంది. ప్రతి ఏటా ఇక్కడ మట్టి కట్ట అడ్డుగా కట్టటానికి బదులుగా ప్రధాన కాలువలో క్రాస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ (షట్టర్‌) నిర్మించాలని గతంలో ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించి క్రాస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మిస్తే అవసరం వచ్చినపుడు షట్టర్‌ దించి తూముకు నీటిని ఎక్కించవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని