logo

నిధులు రూ.6 కోట్లు.. నాణ్యతకు నిలువెల్లా తూట్లు

సింగరేణి ఆధ్వర్యంలో చేపడుతున్న సివిల్‌ నిర్మాణ పనుల్లో డొల్లతనం కనిపిస్తోంది. నాణ్యతలేమితో చేపడుతున్న నిర్మాణాలు ఎంతకాలం నిలుస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. మణుగూరు ఏరియా పీకేఓసీ గని విస్తరించిన నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న

Published : 23 May 2022 06:04 IST
మణుగూరు ఏరియాలో నాసిరకంగా సింగరేణి సివిల్‌ పనులు
 
మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే
పీకేఓసీ నూతన భవన నిర్మాణాలకు వినియోగిస్తున్న నాణ్యత లేని ఇటుకలు

సింగరేణి ఆధ్వర్యంలో చేపడుతున్న సివిల్‌ నిర్మాణ పనుల్లో డొల్లతనం కనిపిస్తోంది. నాణ్యతలేమితో చేపడుతున్న నిర్మాణాలు ఎంతకాలం నిలుస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. మణుగూరు ఏరియా పీకేఓసీ గని విస్తరించిన నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని విభాగాల కార్యాలయాలు, వాహనాలు, యంత్రాల షెడ్లను, అల్పాహారశాలను పూర్తిగా తరలిస్తున్నారు. ఇందుకోసం సంస్థ రూ.6 కోట్లు ఖర్చు చేస్తోంది. గొర్రెపేట వాగు సమీపంలో షెడ్ల రూపంలో చేపట్టిన ఈ పనులను గుత్తేదారులు ఇష్టానుసారంగా సాగిస్తున్నారు. తక్షణం తనిఖీలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అంబేడ్కర్‌ పార్కు కాంపాండ్‌ వాల్‌ నిర్మాణంలో లోపం (ఈ చిత్రం సిమెంట్‌ మిశ్రమాన్ని పూయక ముందు)


ఏఏ పనులు చేస్తున్నారు?

* బేస్‌ వర్కుషాపు * రిపేర్‌ షెల్టర్‌

* డోజర్‌ రిపేర్‌ షెల్టర్‌* వాటర్‌ ట్యాంకు * ఈటీపీ* సబ్‌ స్టేషన్‌

* ఫిల్టర్‌ బెడ్‌ * వాషింగ్‌ ప్లాట్‌ఫాం

* అల్పాహారశాల * విశ్రాంతి గది

* మ్యాన్‌వే * డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసు

* మేనేజర్‌ కారాలయం

* సేఫ్టీ కార్యాలయం

* అంబేడ్కర్‌ పార్కు కాంపాండ్‌ వాల్‌ నిర్మాణం: రూ.15 లక్షలు


ఇలా సాగుతున్నాయి

* పీకేఓసీ నూతన భవనాల నిర్మాణానికి వినియోగించే ఇటుకలు అధ్వానంగా ఉన్నాయి. అవి నాణ్యతగా లేకపోవటంతో ముక్కలు అవుతున్నాయి.

* పనుల్లో సిమెంటును తక్కువగా వినియోగిస్తున్నారు. సిమెంటు కన్నా ఇసుకను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో గోడలు ఏ మాత్రం గట్టిగా ఉండటం లేదు.

* గోదావరి ఇసుక స్థానంలో పరిసర ప్రాంతాల వాగుల్లో లభించే దుబ్బ ఇసుకను వాడుతున్నారు. నిర్మించిన భవనాలకు క్యూరింగ్‌ లేదు.


కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణమూ..

చిన్న పనుల్లోనూ నాణ్యత ఉండటం లేదు. రూ.15 లక్షలతో చేపట్టిన పీవీ కాలనీలోని అంబేడ్కర్‌ పార్కు కాంపౌండ్‌ వాల్‌ గోడ పెచ్చుపెచ్చులుగా ఊడిపోతోంది. దీంతో సదరు గుత్తేదారు పెచ్చులు లేచిన ప్రదేశంలో మళ్లీ సిమెంటు మిశ్రమాన్ని పూసి సరిచేస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యతా లోపంపై కార్మిక సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేశారు.


పర్యవేక్షణ అంతంతే..

సింగరేణిలో ప్రతి సివిల్‌ పనుల్లో అధికారులు పర్యవేక్షణ ఉండాలి. ఎక్కడా అలా జరగటం లేదు. గనిలో చేపట్టే సివిల్‌ పనులు ఎంతో నాణ్యతగా ఉంటాయనేది కార్మికుల అభిప్రాయం. కానీ ప్రస్తుతం పనులు అందుకు విరుద్ధంగా ఉండటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.


‘‘నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్‌ జరుగుతుంది. గోదావరి ఇసుకనే వినియోగిస్తున్నారు. అన్నీ పరీక్షించాకనే అనుమతులు ఇస్తున్నాం. క్యూరింగ్‌కి పైపులైన్లు వేశారు. పార్కు బేస్‌మెంట్‌ నిర్మాణంలో షట్టర్లు వినియోగిస్తారు. అవి తీసిన సమయంలో పెచ్చులు కనిపిస్తాయి.’’

వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని