logo

మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం

కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్‌సభ స్థానం సొంతం.

Updated : 27 Apr 2024 06:36 IST

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, భద్రాచలం 

కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్‌సభ స్థానం సొంతం. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులను మరింతగా ఆకర్శించడానికి ఇక్కడి ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉంది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు రైల్వే మార్గం మరింత అవసరం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల అభిప్రాయాలతో ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

ఆధ్యాత్మిక కారిడార్‌గా భద్రాచలం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, దుమ్ముగూడెం, లక్ష్మణగుట్ట, ఉష్ణగుండాల, ఎటపాక, శ్రీరామగిరితో కూడిన ఈ ఆధ్యాత్మిక కారిడార్‌ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది ప్రణాళికలు, సర్వేలకే పరిమితమవుతోంది. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు 2016లో శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లను ప్రకటించారు. సర్వేలు చేసినా పనులు చేపట్టలేదు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల భద్రాచలంలో పర్యటించటంతో అధికారులు మళ్లీ సర్వేలు చేపట్టారు. సుమారు రూ.200 కోట్లు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ పథకంలో రూ.42 కోట్లు మంజూరు చేసింది. పనులు నత్తనడకన సాగుతున్నాయి. భద్రాద్రి రామయ్యను దర్శించుకోవటానికి ఏటా 30 లక్షలకు పైగా భక్తులు వస్తారు. ఏడాదికి రూ.54 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

చేయాల్సిన పనులు : పర్యాటకశాఖ చేపట్టిన సత్రాల పనులు వేగంగా జరిగేలా చూడాలి. ఆలయ మాడవీధులు, ప్రాకారాలను విస్తరించాలి. ట్రాఫిక్‌ చిక్కులు రాకుండా వేబ్రిడ్జిలు, తీగల వంతెన నిర్మించాలి. గోదావరిలో బోట్‌ షికారును ఆధునికీకరించాలి. రామాలయ క్యూలైన్లతో పాటు మెట్ల మార్గాలను సుందరీకరించాలి. గుడికి 3 కి.మీ. దూరంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో రాముడికి ఉన్న భూముల్లో ఆక్రమణలను తొలగించాలి. కొత్తగూడెం నుంచి రైళ్లను నడిపించాలి.  

మేడారం.. శాశ్వత పనులపై దృష్టి పెట్టాలి

తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఆదివాసీ జాతరైన మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టాలి. మేడారానికి వచ్చే అన్ని మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా విస్తరించాలి. అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలి. భక్తుల విడిది సత్రాలు నిర్మించాలి. జాతీయ హోదా తేవాలి.

రామప్ప.. అభివృద్ధిలో దూసుకెళ్లేలా

యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అభివృద్ధి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ రామప్పను తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం (ప్రసాద్‌)లో చేర్చింది. ఇందుకు రూ.61.99 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో చేపట్టిన ఫుడ్‌కోర్టు, స్టాల్స్‌, అంపీ థియేటర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చెరువు కట్టపైనున్న త్రికూటాలయాన్ని పునరుద్ధరించాలి.
ట 2023-24లో ఆలయానికి వచ్చిన పర్యాటకులు: 1.50 లక్షల మంది. సమకూరిన ఆదాయం రూ.32 లక్షలు.

కారిడార్‌ను కలుపుతూ రైల్వే మార్గం అవసరం

కోల్‌ కారిడార్‌ పేరిట రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు 199 కి.మీ మేర, పాండురంగాపురం నుంచి సారపాక వరకు 12 కి.మీ. మేర కొత్త రైల్వే మార్గం ఏర్పాటుచేస్తే అనేక మందికి మేలు జరుగుతుంది. కోల్‌ కారిడార్‌తో పాటు ఆధ్యాత్మిక కారిడార్‌ కూడా ఏర్పడుతుంది. సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉంటుంది. మేడారం జాతరతో పాటు రామప్ప, లక్నవరం, భద్రాచలం వంటి పర్యాటక స్థలాలకు వెళ్లేవారికి సౌకర్యంగా మారుతుంది.

ద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. భద్రాచలం, పర్ణశాలలో వసతి సదుపాయాల ఏర్పాటు, పాండురంగాపురం రైల్వే లైన్‌ను సారపాక వరకు పొడిగించేందుకు కృషిచేస్తాను.

  పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి

2019లో ఎంపీగా గెలిచిన తర్వాత కొత్త రైల్వే మార్గాల విషయంలో చొరవ చూపాను. ఇప్పటికే భద్రాచలం, రామప్ప వద్ద ప్రసాద్‌ పథకంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోసారి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు యత్నిస్తాను.

 మాలోత్‌ కవిత, భారాస అభ్యర్థి

లోక్‌సభ స్థానం పరిధిలో కొత్త రైల్వే లైన్‌ పనులు జరిగేలా కృషిచేస్తా. భద్రాచలం, రామప్ప ఆలయాల వద్ద వసతలు కల్పనపై దృష్టిసారిస్తా. 2014లో ఎంపీగా పనిచేసినప్పుడు రామప్ప వద్ద కొన్ని పనులు చేశాను.

 అజ్మీరా సీతారాంనాయక్‌, భాజపా అభ్యర్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని