logo

సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ

ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది.

Updated : 27 Apr 2024 06:39 IST

కొత్తగూడెం, న్యూస్‌టుడే : ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. ఆశావహులు కేడర్‌ మద్దతు కూడగట్టుకోవడం ద్వారా పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడాలి. అలా చేయగలిగితేనే అభ్యర్థిత్వం రేసులో నిలిచేది. లేదంటే పోటీలో వెనకబడటం ఖాయం. ఇక, అధికార పార్టీ తరఫున బరిలో నిలిచే అవకాశం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ప్రయత్నమూ ఖరీదుతో కూడుకున్నదై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీలూ దీటుగా నిలిచే అభ్యర్థిని అన్వేషించడం సహజం. ఈ క్రమంలోనే జనాదరణ కలిగి, గెలుపు అవకాశాలు కాస్తోకూస్తో ఉన్న ఏ పార్టీ అయినా అంగ, అర్థబలమే ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లందరిలోనూ ఇంచుమించు ఇదే అభిప్రాయం స్థిరపడిపోయింది. ఈ క్రమంలో ఎన్నికలేవైనా, ‘అభ్యర్థులు ఆర్థికంగా ఎంత గట్టివారు? అనే అంశమే తొలుత చర్చకు తావిస్తుంది. ఆ తర్వాతే వారికి జనంలో ఆదరణ, పాలన అనుభవం, కుటుంబ నేపథ్యం వగైరాలు కారణంగా నిలుస్తున్నాయి’ అని వివిధ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ విషయంలో ఖమ్మం లోక్‌సభ స్థానానికి సైతం ఎంతమాత్రం మినహాయింపు లేదు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు గత ఎన్నికల్లో కోటీశ్వరులనే బరిలోకి నింపడం విశేషం. 2004 నుంచి పరిశీలిస్తే దాదాపు అన్నిసార్లు విజేతలుగా వారే నిలిచారు. సమీప ప్రత్యర్థులూ కరోడ్‌పతులే. తాజా ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు.. భాజపా: రూ.16.25 కోట్లు, భారాస: రూ.155.90, కాంగ్రెస్‌: రూ.58.27 కోట్ల ఆస్తులను చూపారు. ఈసారీ విజయం ఓ కోటీశ్వరుడినే వరించనుండటం విశేషం.

‘ఖమ్మం’ స్థానం వాటా..

  •  2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మొత్తం 430 మంది తమ అఫిడవిట్‌లలో కోటికి పైగా ఆస్తులున్నట్టు చూపారు. వారిలో విజేతలుగా నిలిచినవారు.. 153 (30%) మంది. ఖమ్మం లోక్‌సభ నుంచి గెలిచిన అభ్యర్థి వీరిలో ఒకరు.
  •  2009 సార్వత్రిక సమరాన్ని పరిశీలిస్తే.. బరిలో నిలిచిన కోటీశ్వరులు 1,203 మంది. విజేతల్లోనూ వీరి వాటా 302 (58%). అంటే సగానికి పైగా. ఖమ్మం స్థానాన్ని పరిశీలిస్తే.. విజేత, ప్రత్యర్థి కోట్ల ఆస్తులు చూపారు. ఓ ఇండిపెండెంట్‌ సైతం రూ.4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారు.
  •  మునుపటి రెండు ఎన్నికలతో పోల్చిచూస్తే.. 2014లో ఎక్కువ మంది కోటీశ్వరులు లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. 2,216 (27%) మంది పలు పార్టీల తరఫున పోటీపడగా, వీరిలో అత్యధిక మంది 442 (82%) విజయం సాధించటం విశేషం. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని పరిశీలిస్తే, విజేత, సమీప ప్రత్యర్థి ఇద్దరూ రూ.కోట్లలో ఆస్తులు చూపినవారే. వీరు కాకుండా తెరాస, సీపీఐతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి రూ.కోటికి పైగా ఆస్తులు చూపటం విశేషం.  
  •  2019 లోక్‌సభ ఎన్నికల బరిలో అత్యధికంగా 2,301 మంది (29%) కోటీశ్వరులు అభ్యర్థులుగా నిలిచారు. వీరిలో 88% మంది, అంటే 454 మంది విజేతలుగా నిలిచారు. ఖమ్మం స్థానానికి చెందినవారు (విజేత సహా) ఏకంగా అయిదుగురు (భారాస, కాంగ్రెస్‌, భాజపా, పిరమిడ్‌ పార్టీ, స్వతంత్ర) అభ్యర్థులు కోటీశ్వరులే కావటం గమనార్హం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని