logo

కసరత్తు షురూ..!

ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.

Published : 27 Apr 2024 02:14 IST

తీన్మార్‌ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌
గెలుపు గుర్రాల వేటలో భారాస, భాజపా

 ఈనాడు, నల్గొండ: ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. మే 2న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. గతానికి భిన్నంగా షెడ్యూల్‌కు ఒకరోజు ముందే కాంగ్రెస్‌ పార్టీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన ఒంటెద్దు నరసింహారెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్‌రెడ్డి తదితరులు భారాస తరఫున బరిలో నిలిచేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. భాజపా నుంచి గత ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీచేయగా.. ఉప ఎన్నికలోనూ ఆయనే పోటీచేసే అవకాశం ఉందని సమాచారం. ఆయన సుముఖత వ్యక్తం చేయని పక్షంలో ఓ విద్యావేత్తను రంగంలోకి దింపే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానంలో 4,61,806 మంది ఓటర్లున్నారు.

పార్టీల ప్రతినిధులతో అధికారుల సమీక్ష

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)గా నల్గొండ కలెక్టర్‌ దాసరి హరిచందన వ్యవహరించనున్నారు. అభ్యర్థుల నామపత్రాల దాఖలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండలోనే జరగనుంది. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలని కోరుతూ కలెక్టర్‌ హరిచందన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నల్గొండ కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. మొత్తంమీద 600 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు మనోజ్‌కుమార్‌, మాణిక్‌రావు, సూర్యవంశీ, వ్యయ పరిశీలకుడు కల్యాణ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు