logo

కేసీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల

భారాస అధినేత కేసీఆర్‌ మతి భ్రమించి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 27 Apr 2024 02:12 IST

వడ్లగూడెంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల, వేదికపై మంత్రి పొంగులేటి, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారె తదితరులు

అశ్వారావుపేట, దమ్మపేట, న్యూస్‌టుడే: భారాస అధినేత కేసీఆర్‌ మతి భ్రమించి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ ఆఖరికి రాముడినీ ఎన్నికల అంశంగా మార్చారని విమర్శించారు. వడ్లగూడెంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఇండియా కూటమికి మెజారిటీ వస్తుందని సర్వే నివేదికలు చెబుతుండటంతో మోదీకి ఏంచేయాలో తెలియక దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇస్తే వెనక్కు తగ్గబోరని పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించి పార్లమెంట్‌కు పంపితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మంత్రి పొంగులేటి   శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారాస పాలనలో రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్లు అప్పుల పాలుచేశారని,  రూ.1.50 లక్షల కోట్లను నీటిపారుదల, ఇతర అభివృద్ధి పనుల పేరిట దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో కొత్త కొలువులు రాలేదని, ఉన్న ఉద్యోగాలు పోయాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసిన ఘనత భాజపాకే దక్కిందని విమర్శించారు.  ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మువ్వా విజయబాబు, ఐదు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు,   సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని