logo

కదులుతున్న రైలు ఎక్కబోయి మహిళకు తీవ్ర గాయాలు

కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. స్పందించిన ప్రయాణికులు రైలు కోచ్‌ను కొంచెం వెనక్కి నెట్టి పట్టాలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు లాగారు.

Updated : 01 Jun 2023 06:16 IST

గాయపడిన మహిళను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తున్న ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ శివాని

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. స్పందించిన ప్రయాణికులు రైలు కోచ్‌ను కొంచెం వెనక్కి నెట్టి పట్టాలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు లాగారు. అంబులెన్స్‌ రాకపోయినా రైల్వే పోలీసుల సహకారంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉందని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఈ ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటుచేసుకుంది. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర బంజారాకాలనీకి చెందిన కలసాని నాగేశ్వరరావు మధిర రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నారు. భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఖమ్మం వచ్చారు. పెద్ద కుమారుడికి గవద బిళ్లలు కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. తిరిగి మధిరకు వెళ్లేందుకు ఖమ్మం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులోకి భర్త నాగేశ్వరరావు, పిల్లలు ఎక్కారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు రైలు ముందుకు కదలడంతో కృష్ణవేణి కంగారుగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో కాలు జారిపోయి ప్లాట్‌ఫాం, రైలు మెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తక్షణమే స్పందించిన రైల్వే అధికారులు కొద్దిసేపు రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు కృష్ణవేణిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సుమారు 100-150 ప్రయాణికులు రైలు బోగిని వెనక్కి నెట్టడంతో ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ శివాని క్షతగాత్రురాలిని బయటకు లాగారు. అంబులెన్స్‌ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ కానిస్టేబుల్స్‌ శివాని, ఎస్‌కే అజీజ్‌ సహకారంతో ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ ఎస్సై పి.భాస్కర్‌రావు, హెడ్‌కానిస్టేబుల్‌ ఆళ్ల సత్యనారాయణరెడ్డి ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం కృష్ణవేణి ఆర్యోగం నిలకడగా ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.

ప్రయాణికుల ఆందోళన

మహిళకు ప్రమాదం జరగడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు ఆందోళన చేశారు. రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయానికి చేరుకొని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కేందుకు సమయం పడుతుందని, రైలును ఎక్కువ సమయం ఎందుకు నిలపలేదని ప్రశ్నించారు. రైలు ఎక్కువ సమయం నిలిపే అధికారం తమకు లేదని, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రైళ్ల రాకపోకలు ఎప్పటికప్పుడు జరుగుతాయని స్టేషన్‌ మేనేజర్‌ జీఎన్వీ ప్రసాద్‌, ఆర్పీఎఫ్‌ సీఐ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు సర్ది చెప్పడంతో శాంతించారు. నెక్కొండ సమీపంలో మూడో రైల్వే లైన్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం సైతం పలు రైళ్లు రద్దవడంతో పాటు ఆలస్యంగా రావడంతో ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. రోజువారీ రైళ్లు సమయానికి రాకపోవడం, 11:30 గంటలకు రావాల్సిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు మధ్యాహ్నం 3:00 గంటలకు రావడంతో ఒక్కసారి ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఎగబడాల్సిన పరిస్థితి ఎదురైంది. సహాయక చర్యల్లో ఆర్పీఎఫ్‌ సీఐ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై ప్రసన్నకుమార్‌, మహిళా కానిస్టేబుల్‌ శివాని, కానిస్టేబుల్‌ ప్రదీప్‌, జీఆర్పీ ఎస్సై పి.భాస్కర్‌రావు, హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.సత్యనారాయణరెడ్డి, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని