logo

Kothagudem: కొత్త జీవితం.. అంతలోనే విషాదం

ఎన్నో ఆశలు.. కొత్త జీవితం ఆరంభిస్తున్నామనే ఆనందం.. విషాదాంతమైంది. పచ్చని పందిరి కింద భర్తతో ఏడడుగులు నడిచినప్పుడు జీవితాంతం ఇలాగే సాగాలని ఆమె కన్న కలలు నెరవేరలేదు.

Updated : 03 Aug 2023 08:42 IST

పాల్వంచ గ్రామీణం, లింగాలఘనపురం, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలు.. కొత్త జీవితం ఆరంభిస్తున్నామనే ఆనందం.. విషాదాంతమైంది. పచ్చని పందిరి కింద భర్తతో ఏడడుగులు నడిచినప్పుడు జీవితాంతం ఇలాగే సాగాలని ఆమె కన్న కలలు నెరవేరలేదు. వారికి రెండు నెలల కిందటే వివాహమైంది. చూడముచ్చటైన జంట అంటూ అందరూ ఆశీర్వదిస్తే విధి మరోలా తలిచింది. సరికొత్త వెలుగులను వెతుకుతూ వెళుతుండగా రహదారి ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా, భర్త, అత్తమామలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్సై ప్రవీణ్‌ వివరాల ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబటి శ్రీను, నాగమణి దంపతుల కుమారుడు ప్రశాంత్‌ హైదరాబాద్‌లో కారు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. ఆయనకు ఖమ్మం గ్రామీణం మండలం ముత్తగూడేనికి చెందిన బాలగాని శ్రీను, శ్రీలత కుమార్తె సింధుజ(22)తో రెణ్నెల్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్‌ తన తల్లిదండ్రులు, భార్యతో కలిసి హైదరాబాద్‌ వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున కుందారం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బెలూన్లు తెరుచుకున్నా ప్రమాదం ధాటికి అవి పగిలిపోయాయి. ముందు సీట్లో కూర్చున్న సింధుజ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రశాంత్‌, ఆయన తల్లిదండ్రులు నాగమణి, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ‘108’ సాయంతో క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని, తాము నిద్రపోతున్నట్లు శ్రీను దంపతులు పోలీసులకు వివరించారు. కారు నడుపుతున్న ప్రశాంత్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సై తెలిపారు. మృతురాలి సోదరుడు సందీప్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

ఉపాధి కోసం వలస వెళ్తూ..  ప్రశాంత్‌ గతంలో ఆటో నడిపేవారు. స్నేహితులను చూసి ఇటీవల ఓ పాత కారు కొన్నారు. దాన్ని అద్దెకు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సింధుజకు టైలరింగ్‌ పని వచ్చు. ఆ పనిచేస్తూ భర్తకు చేదుడువాదోడుగా ఉంటున్నారు. ప్రశాంత్‌ బావ హైదరాబాద్‌లో కారు అద్దెకు తిప్పుతూ జీవిస్తున్నారు. ఆయనలాగే ఉపాధి నిమిత్తం అక్కడకు కొద్దిరోజుల క్రితం వెళ్లారు. వారం క్రితం వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంట్లో చేరేందుకని సామగ్రి తీసుకున్న ప్రశాంత్‌ తన భార్య, తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి బయల్దేరి వెళ్లారు. మార్గం మధ్యలో ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన మిగతావారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లు బంధువులు తెలిపారు. సింధుజ మృతదేహం స్థానిక ఆసుపత్రి శవాగారంలో ఉన్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు