logo

శాసనసభ వయా జిల్లా పరిషత్‌

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Updated : 08 Nov 2023 05:44 IST

అసెంబ్లీ ఎన్నికలపై జడ్పీ ఛైర్మన్ల గురి
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

మ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మధిర నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్‌, ఇల్లెందు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కోరం కనకయ్య బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వీరు ఇదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. జడ్పీ ఛైర్మన్లుగా వీరికి పదవీకాలం మరికొన్ని నెలలు ఉన్నప్పటికీ చట్ట సభల్లో ప్రవేశించాలనే ఆసక్తితో వారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు.

జలగం వెంగళరావు...

ఖమ్మం తొలి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా జలగం వెంగళరావు 1959 నుంచి 1964 వరకు పని చేశారు. ఆ తర్వాత ఆయన వేంసూరు నియోజకవర్గం నుంచి 1962, 1967, 1972, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1973లో ఆయన జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు. 1984, 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిగా కూడా పని చేశారు.

  • 1978లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన పూనెం రామచంద్రయ్య ఆ తర్వాత 1983 నుంచి 1987 వరకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు.
  • ఖమ్మం జిల్లాలో గతంలో పలువురు జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా చేసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, మరి కొంతమంది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జడ్పీ ఛైర్మన్లుగా పని చేశారు.

జలగం కొండలరావు

1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1964 నుంచి 1970 వరకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు. 1977, 1980లలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.

  • 1957లో భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పి.వాణీరమణారావు ఆ తర్వాత 1981 నుంచి 1982 వరకు ఖమ్మం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు.
  • 1972, 1975లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికైన చేకూరి కాశయ్య 1987 నుంచి 1992 వరకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు.
  • 1985లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా పని చేసిన చందా లింగయ్య 2001 నుంచి 2005 వరకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు