logo

నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..

నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి.

Published : 28 Mar 2024 01:32 IST

వైద్య పరీక్షల నివేదిక చూపుతున్న లలితకుమారి

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. రెండో కూతురు వెన్నుముక దెబ్బతిని మంచానికే పరిమితమైంది. పెద్ద కూతురు మరణం, ఆ తర్వాత తండ్రి దూరమవడంతో దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇరవై ఎనిమిదేళ్లు వచ్చినా కుమార్తెకు ఆ తల్లి అన్నీ తానవుతోంది. పోషణ భారమై వైద్య ఖర్చులకు చిల్లిగవ్వ లేక దాతల సహాయం అర్థిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..

మధిర మండలం మాటూరుపేట గ్రామంలో పాగొల్లు నాగేశ్వరరావు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కూతురు వివాహం అయిన కొద్ది కాలానికే మృతి చెందింది. ఆ తరువాత బతుకుదెరువు కోసం నాగేశ్వరరావు తన కుటుంబంతో సహా హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. రెండో కుమార్తె లలితకుమారి అనారోగ్యం బారిన పడటంతో మూడో కుమార్తెకు వివాహం జరిపించారు. మూడేళ్ల క్రితం నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో హైదరాబాద్‌లో కుటుంబ పోషణ భారమై లక్ష్మీకాంతమ్మ, తన కుమార్తె లలితకుమారితో కలిసి మాటూరుపేటకు వచ్చింది. ఆ తర్వాత లలితకుమారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శరీరం మొత్తం వాపు వచ్చి మంచానికే పరిమితం కావడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెన్నుముక దెబ్బతిందని, శస్త్రచికిత్స చేస్తే నయం అవుతుందని తెలిపారు. కనీసం లేచి నిలబడలేని పరిస్థితి. కుర్చీలో కూర్చోవడానికి సైతం అవస్థలు పడుతోంది. కుమార్తె మంచాన పడటంతో తల్లి కూలీ పనులకు వెళ్తూ సపర్యలు చేస్తోంది.


రేషన్‌ కార్డులేక.. చికిత్స చేయించలేక

గతంతో వారికి హైదరాబాద్‌లో రేషన్‌ కార్డు ఉండగా మాటూరుపేట వచ్చిన తరువాత రద్దయింది. రేషన్‌కార్డు లేకపోవటంతో చికిత్స చేయించలేని పరిస్థితి ఏర్పడుతోందని తల్లి వాపోయింది. ఆపరేషన్‌కు రూ.5లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రెక్కల కష్టమ్మీద ఆధారపడిన తమకు కుటుంబం గడవటమే కష్టంగా ఉందని, అంత ఖర్చు చేసి శస్త్రచికిత్స ఎలా చేయించాలని తల్లీకూతుళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికే వైద్య ఖర్చులకు రూ.50వేలు అప్పు చేశామని, కనీసం వాటిని తీర్చలేని దుస్థితిలో ఉన్నామని, దాతలు స్పందించి తమను ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రేషన్‌కార్డు, లలితకుమారికి ఆసరా పింఛను ఇప్పించాలని వారు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని