logo

ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు.

Updated : 19 Apr 2024 04:56 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు.

నోటీసు జారీ

 నామినేషన్ల దాఖలుకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నోటీసు (ఫాం-1) జారీ చేస్తారు. అభ్యర్థులు నామినేషన్‌ ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో, ఎవరికి దాఖలు చేయాలో స్పష్టంగా ప్రస్తావిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు సంబంధించిన వివరాలు తెలుపుతారు. వీటితో పాటు ఆయా స్థానాల్లో పోలింగ్‌ ఏరోజు ఏఏ సమయాల్లో జరుగుతుందో వివరిస్తారు. ఫాం-1 ఆధారంగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

లోక్‌సభ స్థానం నామినేషన్‌కు..

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఫాం-2ఏ ద్వారా నామినేషన్‌ దాఖలు చేయాలి. ఫాం-2ఏను లోక్‌సభ నామినేషన్‌ పత్రంగా పేర్కొంటారు. శాసనసభకు ఫాం-2బీ, రాజ్యసభ, శాసనమండలికి ఫాం-2సీలో నామినేషన్‌ సమర్పిస్తారు. అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాలను కేంద్ర ఎన్నికల సంఘమే ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభ    ఎన్నికల నామపత్రాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని సహాయ రిటర్నింగ్‌ అధికారి లేదా తహసీల్‌ కార్యాలయాల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచింది. నామపత్రాలను పూరించటంలో సందేహాల నివృత్తికి ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్కులను సంప్రదించవచ్చు.

అభ్యర్థులకు కీలకమైనవి ఇవే..

ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తాయి. అభ్యర్థుల జాబితాను ఒకేసారి లేదా విడతల వారీగా వెలువరిస్తాయి. జాబితాలో పేరు ఉన్నంతమాత్రాన సదరు అభ్యర్థి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారనేది అనుమానమే. ఎందుకంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి సదరు పార్టీ ఫాం-ఏ, ఫాం-బీ అందించాల్సి ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షుడి  సంతకాలతో కూడిన ఫాంలను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించాలి. అప్పుడే అభ్యర్థులు ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచినట్లు పరిగణిస్తారు.

ఫాం-ఏ అంటే..

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఫాం-ఏలో తెలియజేస్తాయి. వీటిపై ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శి సంతకంతో పాటు ముద్ర ఉంటుంది. పార్టీ ఏ వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎంపిక చేస్తుందో అతడు/ఆమెకు ఇచ్చేదే ఏ-ఫాం. సదరు అభ్యర్థులు ముందుగా ఫాం-ఏను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలి. ఇందులో పార్టీ పేరు, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరి పేర్లు, ఎవరు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తున్నారనే వివరాలు ఉంటాయి.

ఎన్నికల గుర్తును నిర్ణయించేదే బీ-ఫాం..!

తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి వీరే అని ఆ పార్టీ ప్రతినిధి ఇచ్చేదే బీ-ఫాం. దీనిని నామినేషన్‌ సమయంలో ఎన్నికల అధికారులకు అందజేయాలి. నామినేషన్లకు చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు సమర్పించవచ్చు. సదరు పత్రంలో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు,నియోజకవర్గ వివరాలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడి సంతకం ఉంటుంది. నామినేషన్‌తో పాటు అభ్యర్థి బీ-ఫాంను జతచేస్తేనే రిటర్నింగ్‌ అధికారి ఆ పార్టీ గుర్తును  కేటాయిస్తారు. అభ్యర్థి సమర్పించిన ఫాం-ఏ, ఫాం-బీ.. ఈ రెండింటినీ పరిశీలించి అభ్యర్థి సదరు పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.

అఫిడవిట్‌కూ అంతే ప్రాధాన్యం

నామినేషన్‌ దాఖలుతో పాటు ఫాం-26 (అఫిడవిట్‌) సైతం అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఫాం-26 అంటే.. అభ్యర్థులు తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని