logo

పది ఫలితాల్లో వెనుకంజ

పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా గతేడాదితో పోల్చిచూస్తే వెనుకంజ వేసింది. 92.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది మూడు అడుగులు కిందకు దిగజారింది.

Updated : 01 May 2024 05:28 IST

కొత్తగూడెం విద్యావిభాగం, ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా గతేడాదితో పోల్చిచూస్తే వెనుకంజ వేసింది. 92.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది మూడు అడుగులు కిందకు దిగజారింది. జిల్లాలో 16,541 మందికి 15,258 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మునుపటిలాగే ఈ సారీ బాలుర కంటే బాలికలదే పైచేయి సాధించారు. బాలురు 8,521 మందికి 7,714 (90.53%) మంది పాసవగా..  బాలికలు 8,020 మందికి 7,544 (94.06%) మంది ఉత్తీర్ణులయ్యారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యాలయాలు 126 ఉండగా, వీటిల్లో ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలలు 38, గురుకులాలు, ప్రైవేటు పాఠశాలలు 88 ఉన్నాయి. జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాలయాలకు చెందిన 12 మంది విద్యార్థులు 10 జీపీఏ (గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌) సాధించారు. వేంసూరు మండలం మర్లపాడు, చింతకాని మండలం కొదుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. కల్లూరు కూసుమంచి, సత్తుపల్లి ఎస్సీ గురుకులాలు, సత్తుపల్లి, లంకపల్లి, రఘునాథపాలెం, ఎర్రుపాలెం, దానవాయిగూడెం బీసీ గురుకులాల విద్యాలయాలు, వైరా గిరిజన గురుకులంలో పలువురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.

మెరిసిన గురుకుల విద్యార్థులు

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలోని ఎస్సీ, బీసీ గురుకులాల్లో చదివే విద్యార్థులు మంగళవారం వచ్చిన పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎస్సీ గురుకులాల్లో  932 మంది పరీక్ష రాస్తే 908 మంది ఉత్తీర్ణులయ్యారు.  12 ఎస్సీ గురుకులాల్లో అయిదు గురుకులాలు వంద శాతం ఫలితాలను సాధించాయి. వైరా, కల్లూరు, నేలకొండపల్లి, కూసుమంచి, ముదిగొండ ఎస్సీ గురుకులాలు వందశాతం ఫలితాలతో ముందున్నాయి. కల్లూరు బాలికల గురుకులంలో చదివే కె.నవ్యశ్రీ 10 జీపీఏ సాధించారు. కూసుమంచి బాలికల గురుకులానికి చెందిన     బి.స్వాతి 10 జీపీఏ, సత్తుపల్లి బాలుర గురుకులంలో చదివే జే.సిద్ధార్థ 10 జీపీఏతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

బీసీ గురుకులాల్లో...

జిల్లాలో బీసీ గురుకుల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 12 గురుకులాల్లో  758 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 743 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  7 గురుకులాల్లో 100 శాతం ఫలితాలను అందుకున్నాయి. బోనకల్లు(బాలుర), కుంచపర్తి(బాలుర), కూసుమంచి(బాలుర), వైరా(బాలురు), లంకపల్లి(బాలిక), చెరువుమాదారం(బాలికల) మొసలి మడుగు(బాలికల) గురుకులాలు 100 శాతం ఫలితాలతో ముందు వరుసలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని