logo

పదిలోనూ బాలికలదే హవా

పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా గతంకంటే కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్‌ ఫలితాల మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 12,294 మంది పరీక్షలు రాశారు.

Published : 01 May 2024 02:30 IST

రాష్ట్రంలో జిల్లాకు 26వ స్థానం
పాల్వంచ, న్యూస్‌టుడే

పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా గతంకంటే కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్‌ ఫలితాల మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 12,294 మంది పరీక్షలు రాశారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 90.39 శాతం ఉత్తీర్ణత సాధించిన భద్రాద్రి కొత్తగూడెం 26వ స్థానంలో నిలిచింది. 2022, 2023లో జిల్లా 29వ స్థానంతో సరిపెట్టుకోగా, ఈ ఏడాది మూడు స్థానాలు పైకి ఎగబాకింది. ప్రభుత్వ ఉన్నత, కస్తూర్బా బాలికా విద్యాలయాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మెరుగైన ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి కూడా ఉత్తీర్ణత శాతంలో బాలుర కంటే బాలికలదే హవా కనిపించింది. మొత్తం 5,875 బాలురలో 5,181 (88.19%), 6,419 మంది బాలికల్లో 5,931 మంది (92.40%) ఉత్తీర్ణులయ్యారు. పదికి పది గ్రేడ్‌ పాయింట్లు (జీపీఏ) సాధించిన ఘనతను దమ్మపేట మండలం భీమునిగూడెం బాలికోన్నత పాఠశాల విద్యార్థిని జ్యోతిచందు, పినపాక బీసీ గురుకులం విద్యార్థిని ఐ.నిహారిక దక్కించుకున్నారు. శతశాతం ఫలితాలను 52 ప్రభుత్వ విద్యాలయాలు సాధించాయి. ఈ లక్ష్యాన్ని అందుకున్న ప్రైవేటు విద్యాలయాలు 35 ఉన్నాయి.  అనుత్తీర్ణులైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. పునర్‌ మూల్యాంకనం దరఖాస్తుకు 15 రోజుల గడువు ఉంది. ఒక్కో సబ్జెక్టు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. సమాధాన పత్రాల నకలు కాపీ కావాలంటే ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 11.87 శాతం మెరుగుకావడంపై జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అల సంతోషం వ్యక్తం చేశారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయాధికారి సాదనపల్లి మాధవరావు, విద్యాలయాల నిర్వాహకులు, అధికారులను ఆమె అభినందించారు. 

కె.జ్యోతిచందు, దమ్మపేట గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, ఐ.నిహారిక, బీసీ బాలికల గురుకులం, పినపాక

భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 గిరిజన గురుకులాల్లో ఈ ఏడాది పదో తరగతిలో 910 మంది పరీక్ష రాయగా 900 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 86.13 శాతమే ఉత్తీర్ణులవగా ఈ సంవత్సరం 98.90 శాతం పాసవడం విశేషం. ఇందులో 6 చోట్ల 100 శాతం సాధించగా, వీటిలో 5 బాలుర గురుకులాలు ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఐటీడీఏ ఉన్నతాధికారులు, బోధకుల ప్రత్యేక కృషితో ఉత్తమ ఫలితాలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని