logo

ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోట: భట్టి

కాంగ్రెస్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట లాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 01 May 2024 05:32 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట లాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో భారాసకు ఒక్కసీటు మాత్రమే దక్కిందని, కాంగ్రెస్‌పై ఇక్కడున్న ప్రజల నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తల శ్రమను వృథా కానివ్వబోమని ఉద్ఘాటించారు. దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. భాజపా పాలనలో అన్యాయాలు, మత విద్వేషాలను తెలియజెప్పేందుకు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాలన్నారు. భారాస నాయకులు జిల్లాలో తిరుగుతూ అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ హామీలను నూరుశాతం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించారని కోరారు. ఎన్నికల ముందు వచ్చిన తమను అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం దక్కుతుందన్నారు. ఎన్నికల తర్వాత వచ్చిన ఎవరినైనా పదేళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న స్థానిక నేతల సమ్మతితోనే చేర్చుకుంటున్నామని చెప్పారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. తాగు, సాగు నీరు, విద్యుత్‌ సరఫరాపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ... అధిష్ఠానం సౌమ్యుడైన రఘురాంరెడ్డికి టికెట్‌ ఇచ్చిందన్నారు. కార్యకర్తలంతా తామే అభ్యర్థులుగా భావిస్తూ ఎన్నికల్లో కష్టపడాలన్నారు. దేశవ్యాప్తంగా భాజపా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాముడి పేరుతో ఓట్లు అడుగుతూ నాటకాలాడుతోందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సమష్టిగా పని చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. సోనియా, రాహుల్‌, ఖర్గే సూచనలు పాటిస్తూ దేశంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన రెండు విడతల ఎన్నికల్లో సర్వేలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాగానే గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే పాలన సాగించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిశోర్‌, పిడమర్తి రవి పాల్గొన్నారు.

సమావేశంలో రసాభాస.. సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ.. కొందరు నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తుండగా ఓ వర్గానికి చెందిన నాయకులు అడ్డుకున్నారు. కుర్చీల్లో నుంచి లేచి ఆమెను ప్రశ్నించారు. రేణుక వర్గీయులు స్పందించడంతో ఇరుపక్షాల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి ఇరువర్గాలను సముదాయించి శాంతింపజేశారు.

4, 7 తేదీల్లో ప్రముఖుల ప్రచారం

ఈ నెల 4న కొత్తగూడేనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే 7న సినీ నటుడు వెంకటేశ్‌ ఖమ్మం లోక్‌సభ పరిధిలో పలు ప్రాంతాల్లో రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తారని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని