logo

నయనానందకరంగా సీతారామ కల్యాణం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన సాగింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి హనుమాన్‌ చాలీసాను పఠించారు.

Published : 01 May 2024 02:17 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన సాగింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి హనుమాన్‌ చాలీసాను పఠించారు. ప్రధాన ఆలయంలో కొలువైన కోదండ రాముడికి అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. కన్యాదానం, కంకణధారణ చేశారు. సీతాదేవికి యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీత ధారణ కొనసాగించారు. నిత్యకల్యాణ క్రతువులో మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక సంతోషకరంగా సాగాయి. దర్బారు సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. 2న ఉదయం 8 గంటలకు రామాలయ హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈఓ రమాదేవి తెలిపారు.

దీక్షల విరమణకు వెసులుబాటు: శ్రీరామ నవమినాడు ప్రారంభమైన శ్రీరామ పునర్వసు దీక్షను 13న విరమించాల్సి ఉంది. 14న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇందులో 13న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ జరగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 13 నుంచి 15 వరకు భక్తులు దీక్షలను విరమించుకునే వెసులబాటు కల్పించినట్లు ఈఓ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని