logo

దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు.

Published : 01 May 2024 02:25 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రంలో జితేందర్‌రెడ్డి, బాగం, పోటు ప్రసాద్‌, మౌలానా

ఖమ్మం మామిళ్లగూడెం: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. భాజపాకు, ప్రధాని నరేంద్రమోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన  సమావేశంలో మాట్లాడారు. దిల్లీ, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరేన్‌లను అరెస్టు చేశారని, ఈ తరహాలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సైతం ఇబ్బంది పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగించారనే వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి షేర్‌ మాత్రమే చేశారని, దీనిపై దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సైతం పలు సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీకి నోటీసులు మాత్రమే ఇచ్చారని, విచారణకు హాజరు కావాలని ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదని ప్రశ్నించారు.  సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ అసత్య, అసంబద్ధ దుష్ప్రచారాలను చేసేది భాజపా నేతలేనని విమర్శించారు. భాజపాను నడిపించే ఆరెస్సెస్‌ ముఖ్య ఉద్దేశం దేశ అభివృద్ధి కాదని, అనేక సందర్భాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు సైతం రిజర్వేషన్లు రద్దు చేస్తారేమోనన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయని, దీనిపై భాజపా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో   సీపీఐ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి సమావేశం గురువారం జరుగుతుందని తెలిపారు.  సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె.జానీమియా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని