logo

ఏది నిజం?.. సోషల్‌ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..

ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు.

Updated : 23 Apr 2024 08:41 IST

పాల్వంచ, న్యూస్‌టుడే: ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. అవాస్తవ సమాచార వ్యాప్తి నిరోధానికి లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిల్లో ‘వెరిఫై బిఫోర్‌ యూ యాంప్లిఫ్తె (విస్తరణ ముందు నిర్ధారణ)’, ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ ముఖ్యమైనవి. అతి పెద్ద ప్రజాస్వామ్యంలో జరిగి ఎన్నికల్లో అబద్ధ సమాచారం రూపంలో పెద్ద ముప్పు పొంచిఉందని లోగడ ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పై రెండు కార్యక్రమాలతో కలిపి ఎన్నికల వెబ్‌సైట్‌ htpps:// mithvsreality eci.gov.in ద్వారా సమాచార భాండాగారాన్ని ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. అసలు నిజమేంటో పౌరులందరికీ తెలపడమే దీని ముఖ్య లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే అవాస్తవాలు, నిజ సమాచారంతో కూడిన రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు నవీకరించేలా సంఘం చర్యలు చేపట్టింది. పుకార్లు, అసత్య సమాచార వ్యాప్తిపైనా ఉమ్మడి జిల్లాలోని పోలీసులకు గత ఎన్నికల్లో పలు ఫిర్యాదులు అందడం విశేషం. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు గురవకుండా సామాజిక మాధ్యమాల వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవడం మేలని సంబంధిత యంత్రాంగం అవగాహన కార్యక్రమాల్లో సూచిస్తోంది.

నేడు ఓటర్లు సమాచారం కోసం సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో వ్యాప్తి చేసే పుకార్లు, అవాస్తవ సమాచారం ఎక్కువగా పౌరులను తప్పుదోవ పట్టించేలా ఉంటోందని పలు పరిశీలనల్లో తేలింది. కొన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు ఉద్దేశపూర్వకంగా అవాస్తవ సమాచారాన్నీ వ్యాప్తి చేయిస్తుండటాన్ని ఎన్నికల అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఇలాంటి అవాస్తవాలు శరవేగంగా వ్యాప్తి చెందకుండా ఎన్నికల సంఘం కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. నిర్ధారణ ద్వారా జాగ్రత్త, శ్రద్ధ వహించాలని జిల్లా స్థాయి యంత్రాంగాలకు సమీక్షల్లో రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల అధికారులు సైతం దిశా నిర్దేశం చేస్తున్నారు. సందేశాల సారాంశాన్ని ఇతరులతో పంచుకునే ముందే దాని కచ్చితత్వం, ప్రామాణికతను ధ్రువీకరించుకునేలా ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా ఈవీఎంలు, బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్ల, వీవీప్యాట్‌ల పనితీరు, కచ్చితత్వం, సాంకేతిక అంశాలు, ఓటర్ల వివరాలు, పోలింగ్‌ శాతాలు, ఎన్నికల నిబంధనలకు సంబంధించి కచ్చిత సమాచారాన్ని వారు పొందే వీలుంది. ఏమైనా అపోహలున్నా నివృత్తి చేసుకునే అవకాశం ఎన్నికల వెబ్‌సైట్‌లో కల్పించారు. ఓటర్లు, సాధారణ పౌరులకు సమాచార సాధికారత కల్పించడమే ఈ క్రియాశీల కార్యక్రమ లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ‘స్వీప్‌’ విభాగం అధికారి ఒకరు తెలిపారు. తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధంతోనే భారీ ఎన్నికల ప్రక్రియ సమగ్రత, పరిరక్షణ సాధ్యమని ఎన్నికల యంత్రాంగం సైతం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోనూ ‘స్వీప్‌’ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు ప్రాధాన్యం తెలియజెప్పడంతో పాటు పోలింగ్‌ గురించి సాధికార సమాచారం తెలుసుకునేందుకు ఈ సందర్భంగా అవకాశం కల్పిస్తున్నారు.

ఇలా నిర్ధారించుకోవచ్చు..

  • 14% కంటే ఎక్కువ ‘టెండర్‌ ఓట్లు’ పోలైనట్లయితే, ఆ కేంద్రంలో రీ పోలింగ్‌ నిర్వహిస్తారు.
  • ప్రజాప్రాతినిధ్య చట్టం-1951, సెక్షన్‌ 58 ‘రీ పోలింగ్‌’ను మాత్రమే సూచిస్తుంది. టెండరు ఓట్ల కారణంగా నిర్వహించాలనే నిబంధనేదీ లేదు.
  • పోలింగ్‌ బూత్‌కు వెళ్లినప్పుడు ఓటరు లిస్ట్‌లో అసలు పేరు లేదని తెలిస్తే, ఓటరు గుర్తింపు కార్డు, లేదా ఆధార చూపిస్తే ‘ఛాలెంజ్‌ ఓటు’ వేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తారు.
  • సెక్షన్‌ 49జే ప్రకారం ఓటరు జాబితాలో పేరు లేని వ్యక్తి పోలింగ్‌లో ఓటు వేయలేరు. ఎవరైనా ఏజెంట్‌ అసలైన ఓటరు కాదని ఛాలెంజ్‌ చేసినట్లయితే దానిపై ప్రిసైడింగ్‌, ఇతర అధికారులు విచారణ చేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని