logo

సౌరమే సౌభాగ్యం

ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు  లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు.

Updated : 03 May 2024 05:57 IST

సౌరమే సౌభాగ్యం శక్తిని ఒడిసిపడితేనే మేలు


 

ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు  లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. ఈసారి సరిపడినంత వర్షాలు లేవు. ఇప్పటికే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా నీటి(హైడల్‌)తోనే విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది సరిపోవడం లేదు. బొగ్గు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తు(థర్మల్‌)కు సైతం నీరు కావాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎప్పటికీ తరిగిపోని సౌరశక్తితో విద్యుత్తును విరివిగా ఉత్పత్తి చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సౌరశక్తి వినియోగం, లోటుపాట్లు వంటి అంశాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

- ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే


 కాలుష్య రహితం.. 

సౌరశక్తిని ప్రోత్సహించేందుకు సూర్య దినోత్సవాన్ని ప్రతిపాదించారు. సౌరవిద్యుదుత్పత్తి సమయంలో పర్యావరణానికి ఎటువంటి హాని చేసే ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకే దీనిని ‘గ్రీన్‌ ఎనర్జీ’ అంటారు. ఉత్పత్తి అత్యంత చవక. ఎక్కడైనా, ఎంత కొద్ది మొత్తంలోనైనా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. నివాసాలపైనా, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో వీటి పలకలను(సోలార్‌ ప్యానల్స్‌) ఏర్పాటు చేసుకుని ఇన్వర్టర్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. బ్యాటరీల్లో నిల్వ చేసుకుని వినియోగించుకోవచ్చు.

  • సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ రెడ్‌కో) ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం(పీఎం సూర్యఘర్‌ స్కీం)’ ద్వారా ప్రోత్సహిస్తోంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించడం లక్ష్యం. రూ.78 వేల వరకు రాయితీని అందిస్తున్నారు.
  • ఈ విద్యుత్తు ఉపయోగించి కోతులు, ఇతర జంతువుల నుంచి ఇళ్లు, పంట పొలాలకు రక్షణ కల్పించుకోవచ్చు.
  • ఉత్పత్తి చేసి మనం వినియోగించుకోగా మిగిలింది ప్రభుత్వానికి విక్రయించవచ్చు. పరికరాలు అమర్చినప్పుడే మిగిలి విద్యుత్తు గ్రిడ్‌కు వెళ్లేలా అనుసంధానిస్తారు. ఆరునెలలకోసారి మన బ్యాంకు ఖాతాకు డబ్బు చెల్లిస్తారు.

ఇవిగో సౌర వెలుగులు..

  • సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయం ఆదర్శంగా నిలుస్తోంది. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని ఈ కార్యాలయం ప్రాంగణంలో 2023 అక్టోబరు నుంచి సౌర ఫలకాలను ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. 100 కేవీఏ హెచ్‌టీ, 100 కేవీఏ ఎల్‌టీ సౌర ఫలకాలతో నిత్యం సుమారు 900 యూనిట్ల విద్యుత్తు, నెలకు 24 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును ఆన్‌గ్రిడ్‌కు అందజేస్తున్నారు. ప్రతినెలా సుమారు రూ.2 లక్షలకుపైగా విద్యుత్తు బిల్లు ఆదా అవుతోంది.
  •  ఖమ్మం నగరపాలక సంస్థ చైతన్యనగర్‌ రూ.10 లక్షల ఖర్చుతో పార్కులో 10 కేవీ సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేసింది.
  • నగరపాలక సంస్థ కార్యాలయంపై వంద కిలోవాట్లు, ఆవరణలో 30 కేవీ సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ఏమిటీ దినోత్సవం

1978లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ దీన్ని ప్రతిపాదించారు. మే 3న అంతర్జాతీయ సూర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఆచారం ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో పాటిస్తున్నారు.

సద్వినియోగం చేసుకుంటే మేలు...

ప్రస్తుతం సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందించే ఆన్‌గ్రిడ్‌ సర్వీసులు 620 ఉన్నాయి. ఇందులో గృహ విద్యుత్తు 456, వాణిజ్యం 121, చిన్న పరిశ్రమలు 5, పాఠశాలలు/దేవాలయాలు 38 ఉన్నాయి.
ప్రాథమికంగా కొంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ప్రతినెలా చెల్లించే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని దీర్ఘకాలం లెక్కిస్తే ఇది తక్కువే. పంట పొలాల్లో సైతం కొద్దిమందే ఏర్పాటు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని