logo

గతి తప్పిన గణితం... వికసించని విజ్ఞానం

పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు.

Updated : 03 May 2024 04:46 IST

మాతృభాషలోనూ ‘పది’ విద్యార్థుల తడబాటు

పాల్వంచ, న్యూస్‌టుడే: పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు. గణితం, విజ్ఞానశాస్త్రంలో విద్యార్థులు బాగా వెనుకబడటమే దీనికి ప్రధాన కారణం. కొందరు మాతృభాషలో, మరికొందరు ఆంగ్ల సబ్జెక్టులో సమాధానాలు రాసేందుకు ఇబ్బందిపడ్డారు. గతేడాది పది పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 78.52 కాగా, ఈసారి 90.39 శాతానికి పెరిగింది. గణితం, విజ్ఞానశాస్త్రంలో బాగా రాణించినట్లయితే రాష్ట్రస్థాయిలో మరింత మెరుగైన స్థానం దక్కేదని జిల్లా విద్యాశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.

 ఈసారి 26వ స్థానంలో నిలిచినా..

తాజా ఫలితాల్లో అనుత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయి ర్యాంకుపై ప్రభావం చూపింది. 2022, 2023లో వరుసగా 29వ స్థానానికే పరిమితమైన భద్రాద్రి జిల్లా ఈసారి 26కి ఎగబాకడం కాస్త ఊరటనిచ్చేదే. అంతకంటే మెరుగైన ర్యాంకు దక్కించుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. కొందరు విద్యార్థులు మాతృభాష తెలుగులో కనీస మార్కులు సాధించలేకపోవడం ఉపాధ్యాయులను అంతర్మథనంలో పడేస్తోంది. గణితం, విజ్ఞానశాస్త్రం తర్వాత ఎక్కువ మంది అనుత్తీర్ణులైనది సాంఘిక (ఆంగ్లమాధ్యమం)లోనే. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్‌ విద్యాలయాల్లో ఒక్కరైనా 10 జీపీఏ సాధించకపోవటం గమనార్హం. కేవలం ఆశ్రమ, బీసీ గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఈ ఘనత చాటారు.


బదిలీలు.. ఆపై ఎన్నికలు  

2023 సెప్టెంబర్‌లో ఉన్నత పాఠశాలల్లో పీజీ హెచ్‌.ఎం.లు, ఎస్‌.ఎ. ఉపాధ్యాయుల బదిలీ, ఉద్యోగోన్నతులు జరిగాయి. తద్వారా కొన్ని విద్యాలయాల్లో పోస్టుల కొరత ఏర్పడగా, మరికొన్ని చోట్ల కొత్తగా వచ్చినవారు విద్యార్థులకు అనుగుణంగా బోధించలేకపోయారు. ఆతర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొన్నాళ్లు ఉపాధ్యాయులు ఎన్నికల విధులకు వెళ్లారు. బదిలీల ఇబ్బందులతో పాటు పోస్టుల కొరత విద్యార్థుల సన్నద్ధతపై తీవ్ర ప్రభావం చూపింది. సైన్స్‌లో జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పేపర్లతో పరీక్ష నిర్వహించినా కొందరు కనీస మార్కులు సాధించలేకపోయారు. ఆంగ్ల మాధ్యమం సాంఘికశాస్త్రంలో ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సప్లిమెంటరీలోనైనా అనుత్తీర్ణులను గట్టెక్కించేలా విద్యాశాఖ చొరవ తీసుకుంటోంది. సబ్జెక్టుల వారీగా తరగతులు నిర్వహించనుంది. సెలవుల్లో పనిచేసే వారికి ఈఎల్స్‌(ఎర్న్‌డ్‌ లీవ్స్‌) ఇచ్చేలా రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఉంది.


‘పది’ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారికి సబ్జెక్టుల ఉపాధ్యాయులతో దాదాపు అన్ని మండలాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చూస్తున్నాం. ప్రధానోపాధ్యాయులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ‘అభ్యాస దీపికలు’ సాధన చేయించేలా పర్యవేక్షిస్తాం. జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.  
- వెంకటేశ్వరాచారి, డీఈఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని