logo

పట్టభద్రులూ ఓటుకు పోటెత్తాలి

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ   ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ గురువారం  వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు.

Updated : 03 May 2024 05:43 IST

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ గురువారం  వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో భారాస తరఫున జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం


ఆశ్చర్యపరుస్తున్న చెల్లని ఓట్లు

 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి   అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

 ఓటరు నమోదులో కనిపించని చైతన్యం

2021లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల ఎన్నికల సంఘం వెలువరించిన ఓటరు తుది జాబితా ప్రకారం 4,61,786 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గతంలో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్రులు ఓటు నమోదుపై ఆసక్తి చూపకపోవటమే దీనికి కారణం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా ఎన్నికలు జరిగే ప్రతిసారీ పట్టభద్రులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి

ఎన్నిక ఏదైనా ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాభీష్టం మేరకు నాయకులు ఎన్నికవుతారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై ఈసీ దృష్టి సారిస్తోంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా చర్యలు తీసుకుంటోంది. 2015లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 54.62 శాతం పోలింగ్‌ నమోదైతే 2021లో 76.35శాతానికి పెరిగింది. ఈసారి పట్టభద్రుల ఓటర్లు తగ్గటంతో పోలింగ్‌ శాతం ఏ మేరకు నమోదవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో చాలా పోలింగ్‌ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచటంపై ఈసీ దృష్టి సారించాల్సి ఉంది.

జూన్‌ 5న ఓట్ల లెక్కింపు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకునేవారు నల్గొండ కలెక్టర్‌ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఈనెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. 27న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారిగా నల్గొండ కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని