logo

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి: మంత్రులు

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

Updated : 03 May 2024 05:47 IST

 మంచుకొండలో ప్రసంగిస్తున్న మంత్రి తుమ్మల, చిత్రంలో మంత్రి పొంగులేటి, కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి
రఘునాథపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మంచుకొండ సెంటర్‌లో గురువారం నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ  లోక్‌సభ ఎన్నికల అనంతరం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలవుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మానుకొండ రాధాకిశోర్‌, గుత్తా వెంకటేశ్వర్లు,  మద్దినేని స్వర్ణకుమారి, మలీదు జగన్‌, వాంకుడోతు విజయ, దీపక్‌నాయక్‌ పాల్గొన్నారు.

తిరుమలాయపాలెం:లోక్‌సభ ఎన్నికల్లో భారాస, భాజపాను ఏడు కండేలా లోతు గొయ్యితీసి పాతిపెడదామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. దమ్మాయిగూడెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గడిచిన పదేళ్లలో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాసరావు, చావా శివరామకృష్ణ, మంగీలాల్‌, శ్రీను, సురేశ్‌ పాల్గొన్నారు. డీసీసీబీ డైరెక్టర్‌ రామసహాయం నరేశ్‌రెడ్డి మాట్లాడుతుండగా బీరోలుకు చెందిన పలువురు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేశ్‌రెడ్డి మాటలు ఎవరూ వినరని, ఆయన చెబితే ఓటు వేసేవారు కూడా వేయరని కేకలు వేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నరేశ్‌రెడ్డి తన వ్యతిరేక వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి అతడి మాటలను ఖండించారు.

ఖమ్మం మామిళ్లగూడెం: తాను పక్కా స్థానికుడిని అని కాంగ్రెస్‌ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. తన స్వగ్రామం కూసుమంచి మండలం చేగొమ్మ అని పేర్కొన్నారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులను కలిసి మద్దతు కోరారు. మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ మతోన్మాద, ఫాసిస్ట్‌ భాజపాను ఓడించాలన్నారు. ఇండియా కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్‌, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎండీ.జావీద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని