logo

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: నామా

మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Published : 03 May 2024 02:25 IST

కూసుమంచిలో మాట్లాడుతున్న నామా
కూసుమంచి, న్యూస్‌టుడే: మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మోసపూరిత పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు మభ్యపెట్టారని, గద్దెనెక్కి ఐదు నెలలైనా అమలుపర్చకుండా మోసగించారని ఆరోపించారు.  కూసుమంచి కూడలిలో గురువారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెట్టిందన్నారు. రూ.12వేల కోసం ఆటో డ్రైవర్లు, వ్యవసాయ కార్మికులు, రూ.15 వేల రైతుబంధు, రూ.2లక్షల రుణమాఫీ కోసం రైతులు, రూ.4వేల పింఛను కోసం వృద్ధులు ప్రభుత్వ పెద్దలను నిలదీయాలని సూచించారు. పాలేరులోని ప్రతి పౌరుడు తన బిడ్డేనని తన సంపాదనను పంచిపెట్టిన కందాళ ఉపేందర్‌రెడ్డిని ఓడించిన ప్రజలు తమ పొరపాటును గ్రహిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా కేసీఆర్‌ను గౌరవించుకోవాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మంలో నామా నాగేశ్వరరావు రెండు లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తారని ధీమా వ్యకం చేశారు. కేసీఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌ నేతలు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, రానున్న రోజుల్లో కూసుమంచిలోనే ఇల్లు నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉంటానని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తెలిపారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు