logo

రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల

ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 03 May 2024 02:24 IST

 కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దమ్మపేట, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  గండుగులపల్లిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులతో ఆయన మాట్లాడారు. రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావటంలో తెలంగాణ రాష్ట్రం కీలకస్థానం పోషించనుందన్నారు. దశాబ్దాల కాలంగా ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగాలతో కాంగ్రెస్‌ పార్టీని నిలబెట్టిందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపును చూసి, రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి ప్రతిపక్షాలు భయపడాలన్నారు. లోక్‌సభ  ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటేడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్రమోదీ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌ తన స్థాయిని నిలబెట్టుకునే మాటలు మాట్లాడాలన్నారు. పెనుబల్లి మండల భారాస నాయకుడు లక్కినేని వినీల్‌ మంత్రిని కలుసుకొని అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎల్లిన రాఘవరావు, సోమరాజు సీతారామారావు, చీకటి రామారావు, కొయ్యల అచ్యుతరావు, కేవీ సత్యనారాయణ, దొడ్డా ప్రసాద్‌, కాసాని నాగప్రసాద్‌, ఎర్రా వసంతరావు, మోహన్‌రావు పాల్గొన్నారు.

గెలిపిస్తే మరింత సేవ చేస్తా: పోరిక

 మణుగూరు పట్టణం, అశ్వాపురం:  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని   ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు, అశ్వాపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలుతో కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ మరింత సేవ చేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. మిత్రపక్షాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పార్టీ సమన్వయకర్త బిక్కసాని  నాగేశ్వరరావు, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని