logo

భగభగలు

భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 02 May 2024 06:39 IST

హెచ్చరికలు.. జాగ్రత్తలు

నగరంలో తొలిసారి 46.4 డిగ్రీలు నమోదు

 

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో 50 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ ఉండగా అందులో 17 స్టేషన్స్‌లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదై జిల్లా రెడ్‌ జోన్‌లోకి ప్రవేశించింది. తొలిసారిగా ఖమ్మం నగరంలో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిప్పుల కొలిమిని తలపించిన ఖమ్మం నగరంలో మధ్యాహ్న సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎండ వేడిమి, ఉక్కపోతకు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 45 డిగ్రీలు ఆపై నమోదైతే రెడ్‌ జోన్‌గా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఖమ్మంలో ఎక్కడా రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పగటి పూట ఏసీలు ఉపయోగించడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. మే 1వ తేదీనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే మరో నెల రోజులు గడ్డు పరిస్థితులు చూడాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ డిగ్రీలలో)

రెడ్‌ జోన్‌..
వైరా, ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 46.4, పమ్మి 46.2, ఖమ్మం ఎన్నెస్పీ అతిథి గృహం, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌ 46.1, మధిర అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(ఏఆర్‌ఎస్‌) 46.0, బాణాపురం 45.9, గేట్‌ కారేపల్లి, ఎర్రుపాలెం 45.7, నేలకొండపల్లి 45.6, ముదిగొండ, పల్లెగూడెం 45.5, తిమ్మారావుపేట 45.3, కొణిజర్ల 45.2, తల్లాడ 45.1, కాకరవాయి, బచ్చోడు 45.0.

ఆరెంజ్‌ జోన్‌..
చింతకాని 44.9, పెనుబల్లి 44.8, పెద్దగోపతి 44.6, ఏన్కూరు, లింగాల 44.5, కుర్నవల్లి, సత్తుపల్లి 44.4, గౌరారం 44.3, కల్లూరు, తిరుమలాయపాలెం 44.2, నాగులవంచ, వేంసూరు, కూసుమంచి, గుబ్బగుర్తి 44.1, పంగిడి 44.0, సిరిపురం, రఘునాథపాలెం, మధిర 43.9, వైరా ఏఆర్‌ఎస్‌,     రావినూతల 43.8, సదాశివపాలెం, మంచుకొండ 43.7, గంగారం 43.6.


గ్రీన్‌ జోన్‌  (హెచ్చరికల్లేని స్థాయి)
ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గ్రీన్‌ జోన్‌గా పరిగణిస్తారు.
యెల్లో జోన్‌ (మధ్యస్థ ప్రమాద స్థాయి)
35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే.. దాన్ని యెల్లో జోన్‌గా పిలుస్తారు. ఈ స్థాయిలో భానుడి ప్రతాపం, ఉష్ణ గాలులను ప్రజలు తట్టుకోగలరు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి బాధితులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు. దాహం వేయకపోయినా నీరు తాగాలి. లేత రంగులో, వదులుగా ఉండే తేలికైన కాటన్‌ దుస్తులు వేసుకోవాలి. తలపై వస్త్రం, టోపీ ధరించాలి. గొడుగు వాడటం మేలు.


ఆరెంజ్‌ జోన్‌ (అధిక ప్రమాద స్థాయి)

40 నుంచి 45 డిగ్రీలను ఆరెంజ్‌ జోన్‌గా పేర్కొంటారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు వీస్తాయి. బయట పనులు, శారీరక శ్రమ చేసేవారు ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువ. వడగాలులకు తిరగకుండా చల్లని ప్రదేశంలో ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా దాహం వేయకపోయినా బాగా నీరు తాగాలి. ఇంట్లో తయారు చేసుకునే ఓఆర్‌ఎస్‌ ద్రావణం, మజ్జిగ, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి.


రెడ్‌ జోన్‌ (చాలా ఎక్కువ ప్రమాద స్థాయి)

45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే రెడ్‌ జోన్‌గా భావించి మరింత అప్రమత్తంగా ఉండాలి. అన్ని వయసుల వారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వృద్ధులు, గర్భిణులు, పసిపిల్లలు, రోగుల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే బయటకు వెళ్లాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు