logo

ఎలా వెళ్తారో.. అలా రావాల్సిందే..

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వినియోగించే ఈవీఎంలను ఆయా శాసనసభ నియోజకవర్గాలకు తరలించిన అధికారులు.. పోలింగ్‌ సిబ్బందిని సైతం సిద్ధం చేశారు.

Published : 08 May 2024 02:48 IST

పోలింగ్‌కు ముందు.. ఓటింగ్‌ అనంతరం
ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వినియోగించే ఈవీఎంలను ఆయా శాసనసభ నియోజకవర్గాలకు తరలించిన అధికారులు.. పోలింగ్‌ సిబ్బందిని సైతం సిద్ధం చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనుంది. ఈనేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు, సామగ్రి తరలింపు, పోలింగ్‌ నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర కథనం.

ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బంది కేటాయింపు

ఓటింగ్‌ ప్రక్రియలో పోలింగ్‌ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారు. అందుకే సిబ్బంది ఎంపిక, శిక్షణ తరగతులు, పోలింగ్‌ కేంద్రాల కేటాయింపు వంటి అంశాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పోలింగ్‌ సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ ఇప్పించారు. పోలింగ్‌ గడువుకు రెండు రోజుల ముందు సిబ్బందికి ర్యాండమైజేషన్‌ పద్ధతి ద్వారా పోలింగ్‌ కేంద్రాలను నిర్ణయిస్తారు. పోలింగ్‌కు ఒకరోజు ముందే కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాలి.

ప్రత్యేక సంచిలో సామగ్రి

పోలింగ్‌ సిబ్బంది ఓటింగ్‌కు ఒకరోజు ముందు ఆయా నియోజకవర్గాల్లో ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ అధికారులు ఇద్దరు చొప్పున హాజరుకావాల్సిందే. అక్కడే పోలింగ్‌ సామగ్రి, ఈవీఎంలను సంబంధిత సిబ్బందికి అధికారులు పంపిణీ చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పోలింగ్‌ సామగ్రితో కూడిన ఓ ప్రత్యేక సంచి అందిస్తున్నారు. అందులో ఓటింగ్‌ నిర్వహణకు కావాల్సిన వస్తువులు ఉంటాయి. వీటితో పాటు సిబ్బంది విధులు నిర్వర్తించాల్సిన పోలింగ్‌ కేంద్రానికి కేటాయించిన బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్లు అప్పగిస్తారు.

రూట్ల వారీగా తరలింపు

సిబ్బందిని సకాలంలో పోలింగ్‌ కేంద్రానికి తరలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. తొలుత శాసనసభ నియోజకవర్గాన్ని మండలాలు, సెక్టార్లు, రూట్ల వారీగా విభజిస్తారు. ఒక్కో రూట్‌కు 6-8 పోలింగ్‌ కేంద్రాలు వరుసగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో రూట్‌కు ఒక్కో వాహనం కేటాయిస్తారు. ఆయా వాహనాలకు నిర్దేశించిన పోలింగ్‌ కేంద్రాల సంఖ్యతో కూడిన స్టిక్కర్‌ అతికిస్తారు. సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి బయల్దేరిన వాహనం పోలింగ్‌ కేంద్రాల క్రమసంఖ్య ఆధారంగా సిబ్బందిని చేరవేస్తుంది. మరుసటిరోజు పోలింగ్‌ ముగిసే వరకు చివరి పోలింగ్‌ కేంద్రం వద్ద వాహనాన్ని నిలిపి ఉంచుతారు. కేటాయించిన పోలింగ్‌ కేంద్రంలోనే సిబ్బంది ముందురోజు రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

పోలింగ్‌ ముగిసే వరకు వేచిచూడాల్సిందే..

పోలింగ్‌ ముగిశాక అదే పద్ధతిలో సిబ్బందిని స్ట్రాంగ్‌రూంల వద్దకు వాహనాలు చేరుస్తాయి. ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ ప్రక్రియ ఆలస్యమైతే పోలింగ్‌ ముగిసే వరకు వాహనం అక్కడే ఉంటుంది. మిగతా కేంద్రాల్లో పోలింగ్‌ ముగిసినా వాహనం వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

వీటిని తప్పనిసరిగా అప్పగించాల్సిందే..

పోలింగ్‌ ప్రక్రియను ముగించుకున్న సిబ్బంది తమకు కేటాయించిన వాహనంలో స్ట్రాంగ్‌రూంలకు చేరుకుని పోలింగ్‌ సామగ్రిని తిరిగి అప్పగించాలి. బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లతో పాటు పీఓ డైరీ, ఫాం-17ఏ, 17బీ, 17సీ పార్ట్‌-1, 2 తప్పనిసరిగా అందించాలి. వీటికి సంబంధించిన పూర్తి బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారిదే. అలాగే పోలింగ్‌ కేంద్రంలో ఉపయోగించిన ప్రతి వస్తువును (ఈవీఎంలను తుడిచే వస్త్రంతో సహా) ఎన్నికల అధికారులు ఇచ్చిన సంచిలో పెట్టి తిరిగివ్వాల్సిందే. ఈ ప్రక్రియ ముగిశాకే సిబ్బంది తమ నివాసాలకు వెళ్లాలి.


ఖమ్మంలో ఓటు.. ఏపీలో ఎన్నికల విధులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానం భౌగోళికంగా ఏపీలోని ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలతో ఆనుకొని ఉంటుంది. ఏపీలోని అనేక మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వారందరూ రోజూ ఏపీకి వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. ఏపీలో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులు వందల సంఖ్యలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరికి ఏపీలో ఎన్నికల విధులు కేటాయించారు. కానీ ఏపీలో ఓటుహక్కు లేకపోవటంతో తెలంగాణ నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. తద్వారా చాలామంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోతున్నారు. రాష్ట్రాల మధ్య పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించలేదని అధికారులు చెబుతున్నారు.     తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో ఎక్కడ ఓటుహక్కు కలిగి ఉన్నవారైనా ఎన్నికల విధులకు హాజరైతే ఈడీసీ (ఎలెక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌) చూపించి తమకు ఓటున్న నియోజకవర్గంలోని ఏఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని అధికారులు వివరిస్తున్నారు.

అధికారులు పలుమార్లు ప్రకటించినా..

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ సమయంలో ఫాం-8 ద్వారా తాము విధులు నిర్వర్తించే శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి ఓటు బదిలీ (షిఫ్ట్‌) చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగ,   ఉపాధ్యాయులకు మొదటి విడత శిక్షణ సమయంలోనూ ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. అయినా కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటును ఏపీకి బదిలీ చేసుకోలేదు. తీరా ఏపీలో ఎన్నికల విధులకు హాజరవుతూ ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో ఓటు వేయలేకపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు