logo

మత్తు వ్యసనంలో నవతరం

జిల్లాలో సారా, మద్యం, గంజాయి, డ్రగ్స్‌ తదితర వాటికి పలువురు బానిసలవుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వారివారి ఆర్థిక స్థోమతలను బట్టి మత్తు పదార్థాలను ఎంచుకుంటున్నారు. చెడు స్నేహంతో మత్తు పదార్థాలకు

Updated : 26 Jun 2022 06:50 IST

నేడు మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలో సారా, మద్యం, గంజాయి, డ్రగ్స్‌ తదితర వాటికి పలువురు బానిసలవుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వారివారి ఆర్థిక స్థోమతలను బట్టి మత్తు పదార్థాలను ఎంచుకుంటున్నారు. చెడు స్నేహంతో మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు బుగ్గిపాలుచేసుకుంటున్నారు. మైనర్ల నుంచి వృద్థుల వరకు మత్తు వ్యసనానికి బానిసలయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

జిల్లాలో పలువురు యువకులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. అక్రమార్కులు యువతను లక్ష్యంగా చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. వైజాగ్‌కు చెందిన స్మగ్లర్లు వ్యాపారాన్ని పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాలల వద్దకు పంపి మరీ గంజాయిని అలవాటు చేయిస్తున్నారు. గంజాయికి అలవాటుపడిన యువకులు డబ్బు కోసం గంజాయి వ్యాపారులుగా అవతారమెత్తుతున్నారు. వైజాగ్‌ నుంచి కిలోల లెక్కన తెప్పించుకుని చిన్నచిన్న పొట్లాలు చేసి అమ్ముతున్నారు.

డ్రగ్స్‌ సైతం..

చదువుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న యువకులు డ్రగ్స్‌కు అలవాటుపడుతుండటం గమనార్హం. పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మాఫియాలు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుని రవాణా చేస్తున్నాయి. కొందరు యువకులు చదువు పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చినప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆర్డర్‌ ద్వారా మత్తు పదార్థాలు తెప్పించుకుంటున్నారు. ఓ ఉన్నతాధికారి కొడుకు చదువుకునేందుకు పంజాబ్‌ రాష్ట్రానికి వెళ్లి డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇలా పలువురు యువకులు చదువు, ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వీటి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే మెట్‌, ఎల్‌ఎస్‌డీ, ఓపీఎం వంటి మత్తు పదార్థాలు జిల్లాకు పరిచయమయ్యాయి.

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి..

మత్తు పదార్థాలకు అలవాటుపడినవారు మానసిక ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడుతున్నారు. ముభావంగా కనిపించటం, క్షణికావేశాలకు గురవడం, అందరితో కలుపుగోలుతనంగా ఉండలేకపోవడం.. ఒంటరిగా గడపడం.. జ్ఞాపకశక్తి కోల్పోవటం తదితరాలు కనిపిస్తున్నాయి. సంపన్నులు మాత్రం ప్రముఖ వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటూ మంత్రణం ద్వారా అలవాటు మానుకునే యత్నం చేస్తున్నారు. సామాన్య, మధ్య తరగతివారు మాత్రం మాదకద్రవ్యాల ఉచ్చు నుంచి బయటపడలేక బలైపోతున్నారు.

అప్పులపాలై..

గతేడాది కర్నూలు పాతబస్తీకి చెందిన 10 మంది యువకులు 17 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. ఆదోని, ఎమ్మిగనూరు తదితర అన్ని పట్టణ ప్రాంతాల్లో పలువురు యువకులు గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. రైళ్లు, బస్సులు, ప్రత్యేక వాహనాల ద్వారా రవాణా చేస్తున్నారు. దీనికి అలవాటుపడిన పలువురు దొంగతనం, మోసాలు తదితర తీవ్ర నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ యువకుడు గంజాయికి అలవాటు పడి అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని