logo

విద్యా కానుక.. కటకట

మరో మూడ్రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇప్పటి వరకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో రాలేదు. ఎమ్మార్సీ భవనాలకు వచ్చిన కానుకల్లో అరకొర వస్తువులు ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లా

Published : 03 Jul 2022 02:10 IST

జిల్లాకు పూర్తి స్థాయిలో చేరని కానుకలు

5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

సమదుస్తుల కోసం విద్యార్థుల నిరీక్షణ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: మరో మూడ్రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇప్పటి వరకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో రాలేదు. ఎమ్మార్సీ భవనాలకు వచ్చిన కానుకల్లో అరకొర వస్తువులు ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లా ఆదోనిలో 5వ తేదీన విద్యా కానుక పంపిణీ ప్రారంభం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. కిట్లు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పాఠ్య పుస్తకాల ఊసే లేదు●

ఉమ్మడి జిల్లాలో ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ, ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌, రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌, గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు, ఎయిడెడ్‌ తదితర పాఠశాలలు కలిపి 3,034 వరకు ఉన్నాయి. మొత్తం 1,83,623 కిట్లు రావాల్సి ఉంది. ఆయా విద్యాలయాలకు ఈనెల 2 నుంచే విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి.

ఇప్పటివరకు కానుకలు సంపూర్ణంగా రాలేదు. విద్యా కానుక కిట్టులో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడు జతల దుస్తులు, బ్యాగు, బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, నిఘంటువు అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రాత పుస్తకాలే పూర్తిస్థాయిలో వచ్చాయి. వర్క్‌ బుక్కులు రాలేదు. పాఠ్య పుస్తకాల ఊసే లేదు.

త్వరలో పంపిణీ చేస్తాం - రంగారెడ్డి, డీఈవో, కర్నూలు

విద్యా కానుకలు త్వరలో పంపిణీ చేస్తాం. కొన్ని కిట్లు వచ్చాయి. మరికొన్ని రావాల్సి ఉంది. త్వరలో అన్నీ వస్తాయి. పూర్తి వివరాలు సమగ్ర శిక్ష అభియాన్‌ వారి ద్వారానే తెలియాల్సి ఉంది. వారే సరఫరా చేస్తున్నారు.

ఆదోనిలో అధికారుల తలమునకలు

ఆదోని పట్టణంలోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలు అందించనున్నారు. సీఎం వస్తున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ కానుకలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో మొత్తం 1,605 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం నాటికి ఈ కానుకలకు సంబంధించి దుస్తులు, బూట్లు, రాత పుస్తకాలు, నిఘంటువు, బెల్టులు పూర్తి స్థాయిలో రాగా.. బ్యాగులు, పదో తరగతి విద్యార్థులకు దుస్తులు రావాల్సి ఉంది. టెస్టు పుస్తకాలు 50 శాతం వరకు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రానున్న నేపధ్యంలో పాఠశాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో కానుకలు అందేలా చర్యలు చేపట్టారు. ఏ విద్యార్థికి కొరత లేకుండా చూడాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు కొత్త దుస్తులు కుట్టించుకురావాలంటూ పాఠశాల నిర్వాహకులు ఒక జత దుస్తులు విద్యార్థులకు అందించారు. - న్యూస్‌టుడే, ఆదోని విద్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని