logo

వాహనాల గేటు వసూలు పేరిట డ్రైవరుపై దాడి

ఆళ్లగడ్డ పట్టణంలో వాహన గేటు విషయంలో గుత్తేదారుడు లారీ డ్రైవరుపై చేసిన దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ లారీ ట్రక్కుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పురపాలక కార్యాలయం ఎదుట పలు జిల్లాల నుంచి వచ్చిన సంఘం

Published : 17 Aug 2022 02:51 IST

ఆళ్లగడ్డ పురపాలక కార్యాలయం ఎదుట ఆందోళన

ఆందోళన చేస్తున్న లారీ, ట్రక్కు యజమానుల సంఘం నాయకులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పట్టణంలో వాహన గేటు విషయంలో గుత్తేదారుడు లారీ డ్రైవరుపై చేసిన దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ లారీ ట్రక్కుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పురపాలక కార్యాలయం ఎదుట పలు జిల్లాల నుంచి వచ్చిన సంఘం సభ్యులు దాడిని నిరసిస్తూ ప్రదర్శన చేశారు. సంఘం అధ్యక్షుడు మహారథి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో ఒక్క లారీకి రూ.300 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారన్నారు. గత రెండు రోజుల క్రితం గేటు అక్రమాలపై ప్రశ్నించిన నెల్లూరుకు చెందిన లారీ డ్రైవర్‌ (యజమాని) చంద్రశేఖర్‌పై స్థానిక గుత్తేదారుని అనుచరులు దాడి చేయడమే కాకుండా టైర్ల గాలి తీసేశారని, దీనిద్వారా లారీ యజమాని నష్టపోయాడన్నారు. పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా లారీ అసోసియేషన్‌ సభ్యులు ఆళ్లగడ్డకు ర్యాలీగా వచ్చారన్నారు. ఆళ్లగడ్డలో అక్రమంగా గేటు వసూలు చేస్తున్నారని వాపోయారు.

కమిషనర్‌తో మాట్లాడుతున్న మాజీ మంత్రి

ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారన్న సమాచారంతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పురపాలక కార్యాలయానికి చేరుకున్నారు. అక్రమ వసూళ్లపై కమిషనర్‌ ఏవీ రమేష్‌బాబును ప్రశ్నించారు. గుత్తేదారుగా ఉన్న వైకాపా కౌన్సిలర్‌ అక్రమ వసూళ్లపై లారీ యజమానులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘గుత్తేదారు వసూలు చేయాల్సింది ఎంత, చేస్తున్నదెంత’ అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పనుల వల్ల ఆళ్లగడ్డ ఆరాచకంగా మారుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆళ్లగడ్డకు చెడ్డ పేరు వస్తోందన్నారు. ఈ ఘటనపై తాను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట సోదరుడు, తెదేపా నాయకులు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, రామూ యాదవ్‌, కౌన్సిలరు హుస్సేన్‌ బాషా, లారీ సంఘం కార్యదర్శి చలపతి, కోశాధికారి హిదాయతుల్లా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని