logo

పెళ్లికి కావాలి ధ్రువీకరణ

ఇంత వరకు ఎవరి సంప్రదాయాల్లో వారు పెళ్లి చేసుకుంటే చాలు దానికి అధికారిక గుర్తింపు ఉండేది.

Published : 29 Jan 2023 04:25 IST

వందల్లో వివాహాలైతే పదుల్లోనే రిజిస్ట్రేషన్‌

పెళ్లంటే నూరేళ్ల పంట. ఇంత వరకు ఎవరి సంప్రదాయాల్లో వారు పెళ్లి చేసుకుంటే చాలు దానికి అధికారిక గుర్తింపు ఉండేది. కాలం మారింది, ప్రస్తుతం ఏ సంప్రదాయం ప్రకారం చేసుకున్నా సచివాలయాల్లో, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నమోదు చేసుకుని పొందిన ధ్రువీకరణ పత్రమే అధికారిక గుర్తింపుగా మారింది. ప్రతి వివాహాన్ని నమోదు చేయాలన్న నిబంధన ఉన్నా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. ఫొటోలు తీసుకోవడం, వీడియోలు దిగడం, వెడ్డింగ్‌ షూట్‌కు ఇస్తున్న ప్రాధాన్యం అతి ముఖ్యమైన వివాహ నమోదు ప్రక్రియకు ఇవ్వడం లేదన్నది వాస్తవం. వివాహ నమోదుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే చాలా పథకాలకు ఈ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు.

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ


నిర్లిప్తతతో ఉంటే ఇబ్బందులే...

విదేశాలకు వెళ్లాలనుకునేవారు, న్యాయస్థానాల్లో తమకు ఉపయుక్తం ఉంటుందనుకునేవారు మాత్రమే వివాహ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీసా, వర్క్‌ పర్మిట్‌, స్పౌజ్‌ అడ్వాంటేజ్‌ పొందాలంటే కచ్చితంగా వివాహ ధ్రువపత్రం ఉండాల్సిందే. కోర్టుల్లో న్యాయపరమైన సమస్యలు ఏర్పడితే పరిష్కరించుకునేందుకు సైతం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజాసాధికారక సర్వే, రేషన్‌ కార్డులో తొలగింపులు, చేర్పులకు సైతం వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. ఈ పత్రం పొందేందుకు వధూవరుల ఆధార్‌ కార్డులు, ఫొటోలు, తాళి కడుతున్న ఫొటో, పదో తరగతి పత్రాలు, శుభలేఖ, జనన ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు పత్రానికి జత చేసి అందించాలి.


ప్రస్తుతం కొంత మార్పు వచ్చింది

- అబ్దుల్‌ సత్తార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, ఆళ్లగడ్డ

ఇటీవల కాలంలో వివాహ రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మేము స్లాట్‌ కేటాయిస్తాం. కేవలం రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు 20కిపైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహ ధ్రువీకరణ పత్రాలతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పత్రంతోనే పలు పథకాలను అనుసంధానించింది.


అంతంత మాత్రమే..

ఆళ్లగడ్డ పట్టణంలోనే పలు ఫంక్షన్‌ హాళ్లు, దేవాలయాలు, షాదీఖానాలు, చర్చీలు, ఇళ్లలో గత ఆరు నెలల కాలంలో 450కిపైగా వివాహాలు జరిగాయి. గ్రామాల్లో సైతం 100కుపైగా పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. సుమారు 500 వరకు వివాహాలు జరిగినా ఆళ్లగడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మాత్రం కేవలం 105 మాత్రమే నమోదు కావడం గమనార్హం. గతంలో వివాహ నమోదు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే జరిగేవి. ప్రభుత్వ పథకాల కోసం (కల్యాణమస్తు) సచివాలయాల్లో సైతం నమోదు ప్రక్రియ జరుగుతుండటం సానుకూలాంశం. వివాహం చేసుకున్న 3 నెలల్లోపు ధ్రువీకరణ పత్రం కోసం నమోదు చేసుకోవాలి. నెలలోపు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి రుసుములు ఉండవు. నెల దాటితే రూ.100 రుసుము చెల్లించాలి. మూడు నెలలు దాటితే నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని