logo

కానిస్టేబుల్‌ భార్య అనుమానాస్పద మృతి

కర్నూలు నగరంలోని గణేశ్‌ నగర్‌ నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో నివసిస్తున్న వినీల (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన వివాదాస్పదంగా మారింది.

Published : 04 Feb 2023 03:52 IST

వినీల (పాత చిత్రం)

కర్నూలు న్యూస్‌టుడే న్యూస్‌టుడే : కర్నూలు నగరంలోని గణేశ్‌ నగర్‌ నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో నివసిస్తున్న వినీల (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఆదిత్య నగర్‌కు చెందిన విశ్రాంత ఎస్సై నాగన్న రెండో కుమార్తె వినీలకు జిల్లా పోలీసుశాఖ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే చిరంజీవికి ఇచ్చి 2012 ఫిబ్రవరి 12న వివాహం చేశారు. పెళ్లి సమయంలో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వినీలను.. భర్తతోపాటు కుటుంబసభ్యులు మానసిక వేధింపులకు గురిచేస్తుండేవారు. అదనపు కట్నం తీసుకురాకుంటే మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు. 2019లో వినీల తండ్రి ఉద్యోగ విరమణ చేసిన సమయంలో రూ.5 లక్షలు చిరంజీవికి ఇచ్చారు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే ఉన్నా.. మళ్లీ మొదటికొచ్చింది. భర్త చిరంజీవి, అత్త శేషమ్మ, ఆడపడుచు ఆనందమ్మ, ఆమె భర్త ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గిడ్డయ్య, భర్త అన్న మద్దిలేటి ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు. తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకుంటే పిల్లల కోసమైనా సర్దుకు వెళ్లమని చెప్పేవారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వినీల ఇంట్లో ఉరేసుకోగా కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని, భర్త.. అతని కుటుంబసభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపిస్తూ ఆమె తండ్రి నాగన్న ఫిర్యాదు చేశారు. కర్నూలు మూడో పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద శుక్రవారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని