logo

మిత్రులను కబళించిన మృత్యువు

బ్రాహ్మణకొట్కూరు సమీపంలో కేజీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం నందికొట్కూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Published : 31 Mar 2023 02:12 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి.. కోమాలో మరొకరు

జనార్దన్‌ (పాత చిత్రం)

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే : బ్రాహ్మణకొట్కూరు సమీపంలో కేజీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం నందికొట్కూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు కోమాలోకి వెళ్లాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో ఉన్న బైరెడ్డినగర్‌కు చెందిన జనార్దన్‌ (23), దీపక్‌ (22), మధు స్నేహితులు. బీటెక్‌ పూర్తిచేసిన జనార్దన్‌ ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి హైదరాబాద్‌లో పనిచేసేవారు. డిగ్రీ పూర్తిచేసిన దీపక్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకుంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. బుధవారం రాత్రి జనార్దన్‌ హైదరాబాద్‌కు వెళుతుండటంతో కర్నూలులో బస్సెక్కించేందుకు దీపక్‌, మధు కూడా బయల్దేరారు. వీరు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా బ్రాహ్మణకొట్కూరు సమీపంలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద కేజీ రహదారిపై అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో జనార్దన్‌, దీపక్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మధు కోమాలోకి వెళ్లాడు. బ్రాహ్మణకొట్కూరు ఎస్సై ఓబులేసు సంఘటనా స్థలానికి చేరుకుని మధును 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

దీపక్‌ (పాత చిత్రం)

పండగ పూట విషాదం : గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం, మరొకరు కోమాలోకి వెళ్లడంతో బైరెడ్డినగర్‌లో విషాదం అలుముకుంది. చేతికందొచ్చిన యువకుల అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీపక్‌ తల్లి అనారోగ్యంతో ఎనిమిగి నెలల కిందటే మృతి చెందారు. ఇప్పుడు కుమారుడు కూడా దూరమవడం వారి కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని