logo

ప్రజాప్రతినిధి... చిత్రం చెబుతోంది.. చిత్తం చూపమని

వెయ్యి పదాల్లో చెప్పాల్సిన విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పవచ్చు.. లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ చిత్రాలు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నాయి.

Updated : 19 Aug 2023 04:44 IST

ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా చిత్రనివేదన

వెయ్యి పదాల్లో చెప్పాల్సిన విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పవచ్చు.. లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ చిత్రాలు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నాయి. పనులు అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణం ఎవరని అడుగుతున్నాయి. ప్రజాకాంక్షలు గుర్తించిన గత ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలు రూపొందించింది. సమస్యల పరిష్కారానికి రూ.కోట్లు  కేటాయించింది. పనులూ ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారింది. వైకాపా పాలన పగ్గాలు అందుకుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై శీతకన్ను వేసింది. నిధులు విడుదల చేయకపోవడంతో  పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకురావడం లేదు. నాలుగేళ్లుగా మొండిగోడలపై వదిలేయడంతో ప్రజలు మండిపడుతున్నారు.

 చిత్రాలు,ఈనాడు-కర్నూలు, నంద్యాల బొమ్మల సత్రం


పాలకుల ఒట్టిమాటలు

రూ. 10 కోట్లు

న్యూస్‌టుడే, కౌతాళం: కౌతాళం మండలంలోని 16 గ్రామాల్లోని 40 వేల మందికి మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో తెదేపా హయాంలో హాల్వి వద్ద సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.10 కోట్లు వెచ్చించి 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.  అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 60 హెచ్‌పీ సామర్థ్యమున్న మోటారు బిగిస్తే నీటి పంపింగ్‌కు అవకాశం ఉంటుంది.. ఇందుకు రూ.6-రూ.7 లక్షలు ఖర్చు అవుతాయని ఇంజినీర్ల అంచనా. నిధులు మంజూరు చేయకపోవడంతో గత నాలుగేళ్లు ట్యాంకు ఒట్టిపోయింది.


నిపుణుల నివేదికకు నీళ్లు

రూ. 100 కోట్లు

శ్రీశైలం జలాశయం నిర్వహణ కోసం రూ.100 కోట్లకు పైగా నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పనులు పడకేశాయి. గేట్ల వద్ద నీరు లీకై వృథాగా పోతోంది. గేట్ల వద్ద రబ్బరు సీల్‌ అమరిక సరిగా లేకపోవడంతో స్లూయిజ్‌ల లీకుల ద్వారా నీరు వృథాగా పోతోంది. ఫ్లంజ్‌పూల్‌ నిర్వహణలో విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకు ముందడుగు పడలేదు.


వంతెన ఆగింది.. కష్టం మిగిలింది

రూ. 7.33 కోట్లు

నంద్యాల పట్టణంలో కుందూ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని తెదేపా హయాంలో నిర్ణయించారు. రూ.7.33 కోట్ల అంచనాతో పనులను 2017లో ప్రారంభించారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తను తలపిస్తున్నాయి. మరికొన్ని పిల్లర్లు వేయాల్సి ఉండగా పనుల్లో తీవ్ర ఆలస్యమవుతోంది. నదికి వరదలు వస్తే సుమారు 20 గ్రామాలకు రాకపోకలు ఆగిపోతాయి. పాత వంతెన దిక్కవడంతో జనం నిత్యం ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.


నీళ్లు రావు.. నిర్లక్ష్యం.. మొక్కైంది

రూ. 1942 కోట్లు

పశ్చిమ ప్రాంతంలో బీడు భూములకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో రూ.1942 కోట్లతో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. హాలహర్వి మండలం నెట్రవట్టి వద్ద 8 టీఎంసీల నీటిని నిల్వ చేసి 80 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. తర్వాత ప్రభుత్వం మారింది.. వైకాపా అధికారంలోకి వచ్చింది. 3 టీఎంసీలకు తగ్గించి.. 30 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ఆయకట్టును కుదించారు. మూడు చోట్ల పైపులు వేశారు.. రెండు చోట్ల గుంతలు తవ్వారు.. అంతకు మించి పనులు చేపట్టలేదు. ఆ పైపుల్లో మొక్కలు ఏపుగా పెరిగి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.


ఉర్దూకలశాల

రూ. 18 కోట్లు

  • మైనార్టీ విద్యార్థులకు ‘ఉన్నత’ చదువులు అందించాలన్న ఉద్దేశంతో తెదేపా హయాంలో నగరంలో 2018లో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఓర్వకల్లు వద్ద సొంత భవనం నిర్మాణానికి 2019లో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీకి రూ.18 కోట్లు కేటాయించారు.  40 శాతం పనులు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు.గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆపేసి న్యాయస్థానాన్ని  ఆశ్రయించారు.

పైకప్పు మరిచి కన్నీళ్లు మిగిల్చి

రూ. 2.50 కోట్లు

  • ఆదోని మార్కెట్లో ఏటా రూ.1500-1600 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి. వర్షం వస్తే పంట ఉత్పత్తులు తడిసిపోతున్నాయి.దీంతో తెదేపా హయాంలో రూ.2.50 కోట్లతో  షెడ్డు నిర్మాణం చేపట్టారు. పైకప్పు వేయాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా విదిల్చలేదు.  ఏటా మార్కెటింగ్‌ శాఖకు రూ.12-16 కోట్ల ఆదాయం వస్తోంది.. వాటిని ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంటోంది తప్ప ఇక్కడి సమస్యలు పట్టించుకోవడం లేదు.

న్యూస్‌టుడే, ఆదోని మార్కెట్‌


సాంకేతిక విద్యకు అడ్డేశారు

రూ. 8.25 కోట్లు

  • నంద్యాలలోని టెక్కే ప్రాంతంలో ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పరిపాలన భవనం, వసతి గృహ సముదాయం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో.. 2019 మార్చిలో రూ.8.25కుపైగా నిధుల అంచనాతో పనులు ప్రారంభించారు. రూఫ్‌లెవల్‌ వరకు పనులు జరిగాయి. ప్రభుత్వం మారడంతో మధ్యలో ఆగిపోయాయి. ఫలితంగా 1,100 మంది విద్యార్థులు పాత భవనంలో తీవ్ర ఇబ్బందుల మధ్య చదువుకుంటున్నారు. నిర్మాణ ప్రాంతం  అధ్వానంగా మారింది.

బిందె నింపని పనులు

రూ. 144 కోట్లు

  • ఎమ్మిగనూరు పట్టణంలో   మంచినీటి పథకం కోసం తెదేపా  హయాంలో రూ.144 కోట్లు మంజూరు చేశారు.రెండు ప్యాకేజీలుగా విభజించి తాగునీటి ట్యాంకులు, శుద్ధిజల కేంద్రాలు, ఎమ్మిగనూరు నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు 20 కిలోమీటర్లు పైపులైన్‌ చేపట్టాల్సి ఉంది. పట్టణంలో 105 కి.మీ పైపులైన్లు కొత్తగా వేయాల్సి ఉంది. గుడేకల్లు పంప్‌హౌస్‌లో , మైనార్టీ శివన్ననగర్‌ కాలనీలో ట్యాంకుల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. ఇప్పటివరకు రూ.5 కోట్ల మేరకు పనులు పెట్టినా బిల్లులు మంజూరు చేయలేదు.  

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


ప్రభుత్వ వెనుకబాటుతనం

కర్నూలు బీక్యాంపులో 2018 ప్రాంతంలో రూ.5 కోట్ల అంచనాతో చేపట్టిన బీసీ సంక్షేమ భవన్‌ పిల్లర్ల దశలో ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం పైసా విడుదల ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు