logo

ఐదేళ్ల ‘దారి’ద్ర్యం

జగన్‌ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్‌ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి..

Updated : 27 Apr 2024 05:46 IST

రహదారులకు కరవైన కనీస మరమ్మతులు
ప్రాణాలను తోడేస్తున్న గోతులు

జగన్‌ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్‌ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. ఛిద్రమైన రోడ్లపై వెళ్తున్న వాహనదారుల ఒళ్లు హూనం అవుతోంది.. ప్రయాణికులు ఆసుపత్రుల పాలవుతున్నారు.. గుంతలు దాటలేక ఆర్టీసీ బస్సులను ఆపేసింది.. గుంతలు పూడ్చక కుటుంబాలకు కుటుంబాలనే విషాదంలోకి నెట్టేస్తోంది. ఎన్నో కుటుంబాల కన్నీటిగాథలకు కారణభూతమైంది.

‘‘‘ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మద్దూర్‌నగర్‌కు చెందిన నర్సయ్య(44) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బతుకుబండిని నడిపేవారు. డయాలసిస్‌ కోసం గతేడాది జులై 29న ద్విచక్రవాహనంపై నగరంలో కిమ్స్‌ ఆసుపత్రికి వెళ్తున్నారు. మార్గమధ్యంలోని లక్ష్మీనగర్‌ రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయారు. తీవ్రగాయాలపాలైన నర్సయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఫలితంగా ఆయన కుటుంబం రోడ్డున పడింది. భార్య భాగ్యలక్ష్మి దివ్యాంగురాలు. దీంతో ఆ కుటుంబ పోషణ భారం వారి రెండో కుమార్తె హరిప్రియపై పడింది.

కర్నూలు జిల్లాలో 1530.817 కి.మీ, నంద్యాలలో 1512.505 కి.మీ. రహదారులు విస్తరించి ఉన్నాయి. రోడ్ల మరమ్మతులకు తెదేపా (2014-19) హయాంలో ఏటా రూ.30- రూ.50 కోట్ల వరకు మంజూరు చేసేవారు. ఆ నిధులతో రహదారుల వెంట ఉన్న ముళ్లపొదలు తొలగించడం.. గుంతలు పూడ్చటం.. సూచికలు ఏర్పాటు చేయడం.. వంతెనలకు మరమ్మతులు చేయడం వంటి పనులు చేసేవారు. జగన్‌ జమానా (2019-24)లో రూ.10-రూ.12 కోట్ల వరకు కేటాయిస్తున్నారు. విడుదల మాత్రం సకాలంలో చేయడం లేదు.  కర్నూలు- కోడుమూరు, ఆదోని- ఎమ్మిగనూరు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. కనీసం గుత్తుల్లో దారు వేయడానికి కూడా నిధుల్లేవు.

ఇద్దరు శంకుస్థాపన చేసినా

న్యూస్‌టుడే, హొళగుంద: ఆదోని- హొళగుంద మార్గంలో (35 కి.మీ) ఏడు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి అధ్వానంగా మారడంతో ఆర్టీసీ అధికారులు హొళగుందకు సర్వీస్‌లు నిలిపివేశారు. ఆదోని నుంచి ఢణాపురం, హెబ్బటం మీదుగా హొళగుంద వెళ్లే ఐదు సర్వీసుల్ని కొద్ది రోజుల కిందç రద్దు చేశారు. ఆదోని నుంచి ముద్దటమాగి వరకు ప్రస్తుతం ఒక్క సర్వీసు తిరుగుతోంది. వందవాగిలి, లింగంపల్లి గ్రామాల నుంచి మండల కేంద్రానికి ఆర్టీసీ సేవలు దూరమయ్యాయి.  రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసింది. మంత్రి హోదాలో గుమ్మనూరు జయరాం, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. నిధులు రాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.

మృత్యుగుంత

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు గ్రామీణం: ఎమ్మిగనూరు  కంబళదిన్నె మధ్య రహదారి అధ్వానంగా ఉంది. గతేడాది జులై 28న ఇంజినీరింగ్‌ విద్యార్థి లింగారెడ్డి, గోవర్దన్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తూ గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లింగారెడ్డి మృతి చెందగా, గోవర్దన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ మార్గం గుండా పెద్దకడబూరు, కోసిగి, మంత్రాలయం మండలాలకు చెందిన సుమారు 50 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. 12 కి.మీ. రహదారి నిర్మాణ పనులకు రూ.23 కోట్లతో టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ పనులు 2023 వరకు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ రహదారి గుండానే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి వెళ్తారు.  అర గంట ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతోందని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి.

ఏడీబీ నిధులు వెనక్కి

ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. కర్నూలు జిల్లాలో ఆరు రహదారుల అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిధులు కేటాయించాలి. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో ఏడీబీ నిధులు గతేడాది వెనక్కి వెళ్లాయి. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో  50 కి.మీ.ల రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో నిధులు వెనక్కి వెళ్లాయి.

వాటా ఇవ్వని రాష్ట్రం

ఉమ్మడి జిల్లాలో 21 రహదారులకు ఏన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు) నిధులు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం కేటాయించాలి. ఉమ్మడి జిల్లాలో 21 రోడ్లకు రూ.528 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్రం తన వాటా విడుదల చేయలేదు. మూడేళ్ల పాటు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ విభాగం ఎదురుచూసి నిధులు వెనక్కి తీసుకుంది.  వెలుగోడు-మిడుతూరు-గార్గేయపురం రహదారికి రూ.40.91 కోట్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభమే కాలేదు.  కోడుమూరు- వెల్దుర్తి రహదారిది ఇదే పరిస్థితి.

గుత్తే దారిల వెనుకడుగు

రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు.. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘మేజర్‌ ప్లాన్‌’ పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాలు, మండల కేంద్రాలను కలిపే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. మూడేళ్లుగా బండి ఆత్మకూరు- ఓంకారం రహదారి పనులు సా..గుతూనే ఉన్నాయి. రూ.19 కోట్లతో చేపడుతున్న ఈ రహదారి పనులు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బనగానపల్లి బైపాస్‌ రహదారి నిర్మాణ పనులు సర్వే దశలోనే ఆగిపోయింది.

పుష్కర కాలం దాటాలి

తుంగభద్ర పుష్కరాల వేళ నాలుగేళ్ల కిందట  21 రహదారుల అభివృద్ధికి రూ.65 కోట్లు కేటాయించారు. ఇందులో సగం రహదారులకు నిధులు మంజూరు కాలేదు. సుంకేసుల- నాగులదిన్నె రోడ్డుకు రూ.6 కోట్లతో మరమ్మతులు చేస్తున్నట్లు ప్రకటించి తర్వాత రద్దు చేశారు. రూ.1.40 కోట్లతో కర్నూలు- లక్ష్మీపురం రహదారి, రూ.1.10 కోట్లతో అనుగొండ-లక్ష్మీపురం, రూ.2 కోట్లతో ఉల్చాల-రేమట-కొత్తకోట రహదారి, రూ.13.20 కోట్లతో కర్నూలు-బళ్లారి రహదారి పనులు ప్రారంభమే కాలేదు. రూ.23.70 కోట్ల పనులు నాలుగేళ్లయినా ప్రారంభించలేదు.

నాలుగు ఏళ్లుగా బస్సు బంద్‌

న్యూస్‌టుడే, మంత్రాలయం గ్రామీణం: మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోసిగి మండలాలను కలిపే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. రోడ్డు బాగా లేదని ఈ దారిలో ఆర్టీసీ బస్సులను తిప్పలేమంటూ ఎమ్మిగనూరు డిపో అధికారులు బస్సులను రద్దు చేశారు. బాగుచేస్తే 35 వేల మంది రాకపోకలకు సులువుగా ఉంటుంది.

2 కి.మీ వేయలేక పోయారు

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం: పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలను కలిపే దగ్గరి దారి. నిధుల్లేక 2 కి.మీ.ల నిర్మాణం ఆగిపోవడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఆలూరు మండలం కె.కొట్టాల నుంచి పత్తికొండ మండలం హోసూరు వరకు 7 కి.మీ. మేర బీటీ రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. నిధులు మంజూరయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7 కోట్లు మంజూరు చేశారు.  పత్తికొండ నియోజకవర్గ పరిధిలో పనులు పూర్తి అయ్యాయి. నిధులు సరిపోవడం లేదని ఆలూరు నియోజకవర్గ పరిధిలో రెండు కి.మీ. మేర ఆపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని