logo

జగన్‌ కుట్ర ఎండలో పండుటాకుల విలవిల

నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం.

Published : 03 May 2024 04:33 IST

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ఇంటింటికి మరిచారు.. సచివాలయానికి పిలిచారు

  • నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారా? లేదా? అని అటు మున్సిపల్‌, ఇటు మండల పరిషత్‌ అధికారులు పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవు.గూడూరు అర్బన్‌లో 91.03 శాతం పంపిణీ చేశారు. ఓర్వకల్లు, పెద్దకడబూరు, గూడూరు, ఎమ్మిగనూరు, మద్దికెర, కర్నూలు అర్బన్‌, ఆదోని, నందవరం మండలాల్లో ఇంటింటికి పింఛను పంపిణీ ముమ్మరంగా జరిగింది. కల్లూరు, మంత్రాలయం, కోసిగి, హొళగుంద మండలాల్లో మందకొడిగా సాగిందని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.

ఖాతా.. మనుగడ లేక

15 వేల మందికిపైగా బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో డబ్బులు జమ కాలేదు. చరవాణికి సంక్షిప్త సమాచారం రాకపోయినా ఖాతాలో డబ్బు జమై ఉంటుందన్న ఉద్దేశంతో బాం్యకులకు వెళ్లారు. తీరా జమ కాలేదని తెలిసి నిరాశతో సచివాలయాలకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,188 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 10 వేల మందికిపైగా బ్యాంకు ఖాతాలు లేనివారు ఉన్నారు. వారికి పింఛను సొమ్ము ఎలా జమైందో అదికారులకే తెలియాలి.


సర్వీసు ఛార్జీల పేరుతో కోత

చాలామంది పింఛనుదారుల చేతికి రూ.3 వేలు అందలేదు. బ్యాంకు సర్వీసు ఛార్జీలు, సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్‌) ఛార్జీలు తదితరాల పేరుతో రూ.200 నుంచి రూ.400 వరకు పట్టుకుని మిగిలిన సొమ్ము పంపిణీ చేశారు. ఇంటింటికి పంపిణీ చేసి ఉంటే కోతలు ఉండేవి కావని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.


ఆగిన ఏటీఎం సేవలు

జిల్లా వ్యాప్తంగా 334 ఏటీఎం కేంద్రాలున్నాయి. ఏటీఎం కార్డులు కలిగిన పింఛనుదారులు పింఛను సొమ్మును డ్రా చేసుకుందామని ఏటీఎం కేంద్రాలకు వెళితే పనిచేయలేదు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో 20కి పైగా ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మండల కేంద్రాలు, బ్యాంకుల పరిధిలో పరిస్థిథి ఏంటో? అక్కడక్కడా పనిచేసిన ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, వితంతువులు బారులు తీరారు.


వసూళ్ల పర్వం

  • ఉమ్మడి జిల్లాలో ఎస్‌బీఐతోపాటు మరికొన్ని బ్యాంకులకు పింఛనుదారులు పోటెత్తడంతో సొమ్ము పంపిణీ చేయలేదు. బ్యాంకు శాఖలకు సంబంధించి అనుసంధానంగా సేవా కేంద్రాలున్నాయి. ఆ సేవా కేంద్రాల్లోనే పింఛను సొమ్ము ఇచ్చారు. వాస్తవానికి రూపాయి తీసుకోకుండా డబ్బు పంపిణీ చేయాల్సి ఉంది. చాలా సేవా కేంద్రాల్లో ఒక్కో పింఛనుదారుడి నుంచి రూ.10, రూ.20, కొన్నిచోట్ల రూ.50 వరకు వసూలు చేయడం గమనార్హం.
  • జిల్లాలో  526 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఒక్కో పింఛన్‌ సొమ్ము పంపిణీ చేసేందుకు రూ.100, రూ.200కుపైగా వసూలు చేశారు. గ్రామాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లలేక.. రవాణా ఛార్జీలు భరించలేక బిజినెస్‌ కరస్పాండెంట్లకే కొంత మొత్తం చెల్లించి పింఛను సొమ్ము తీసుకున్నారు.

బ్యాంకులకు వెళ్లమన్నారు

జిల్లాలో 2,46,340 మంది సామాజికి పింఛను తీసుకుంటున్నారు. మే నెలకు సంబంధించి పింఛన్‌ సొమ్ము 58,244 మందికి ఇంటి వద్దే ఇస్తామని 1,88,096 మందికి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పట్టణ ప్రాంతానికి చెందిన వారు 47,637 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 1,40,459 మంది ఉన్నారు. వారంతా గురువారం బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు.


పైసలు పడలేదన్నారు

లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీయగా చాలా మందికి ఖాతాల్లో నగదు జమ కాలేదు..  కొందరికి రెండు ఖాతాలు ఉన్నాయి.. ఏ ఖాతాలో జమ చేశారో తెలియడం లేదు. ఖాతాలే  లేని వారి పరిస్థితేంటన్నది చెప్పడం లేదు. మరికొందరి ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాలేదు.. వారికీ డబ్బులు జమ కాలేదు.


సొమ్మసిల్లేలా చేశారు

ఒకటో తారీఖు వచ్చేసరికి.. సూర్యోదయానికి ముందే చక్కటి చిరునవ్వుతో ప్రతి అవ్వాతాతకు పింఛను అందిస్తున్నామంటూ గొప్పులు చెబుతున్న జగన్‌.. రాజకీయం కోసం వృద్ధులను బ్యాంకులకు రప్పించారు.. ఇంటింటికీ పింఛన్లు సులభమైనా ససేమిరా అంటూ బ్యాంకుల వద్ద కూర్చోబెట్టారు.

పండుటాకులను ఎర్రటి ‘ఎండ’లో ఉంచారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. కర్నూలు జిల్లాలో రెండు మండలాలు, నంద్యాలలో 22 మండలాల్లో వేడిగాలులు (వడగాల్పులు) వీచాయి. డోన్‌, బనగానపల్లిలో గరిష్ఠంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


రూ.700 కోత పెట్టారు

- రంగస్వామి, శరీన్‌నగర్‌

న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ: పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో వేశారు. కృష్ణానగర్‌లోని ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంకులో నగదు తీసుకునేందుకు వచ్చా. చాలా రోజులుగా ఖాతా మన్నికలో లేదు. ఫలితంగా బ్యాంకు సిబ్బంది రూ.700 పట్టుకున్నారు. నాకు వచ్చే రూ.3 వేల పింఛనులో చేతికి రూ.2,300 మాత్రమే ఇచ్చారు. అంత డబ్బులు మినహాయించుకోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాలాంటి వారికి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.


అప్పు ఉందని ఇవ్వలేదు

- గుంజపల్లి చంద్రమ్మ, పెద్దకడబూరు

న్యూస్‌టుడే, పెద్దకడబూరు: నా పేరు మీద బ్యాంకులో అప్పు ఉందని పింఛను ఇవ్వకుండా అధికారులు వెనక్కి పంపించేశారు. మాది నిరుపేద కుటుంబం. మూడేళ్ల కిందట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.20 వేల అప్పు తీసుకున్నాను. ఏటా రెండేళ్లపాటు  వడ్డీ చెల్లిస్తూ వచ్చాను. ఈ ఏడాది వర్షాభావంతో బెంగళూరుకు వలస వెళ్లాం. వడ్డీ కట్టలేదు. ఈ నెల పింఛను కోసం బ్యాంకుకు రాగా, మీరు అప్పు వడ్డీ చెల్లించకపోవడంతో నీ ఖాతా లాక్‌ అయిందన్నారు. పింఛనుకు, అప్పునకు ముడిపెడితె ఎలా? పింఛను రాకపోతే నా ఖర్చులు ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు.


60 కి.మీ ప్రయాణం

న్యూస్‌టుడే, ఆస్పరి: ‘‘ మా ఊరు తంగరడోణ.. గ్రామం నుంచి ఆస్పరికి 60 కి.మీ దూరం. ఛార్జీలు రూ.150 వరకు అయ్యాయి.. బస్సులు రావు.. తిప్పలు పడి బ్యాంకు వద్దకు వచ్చా.. సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చిందని’’ రంగమ్మ ఆందోళన వ్యక్తం చేశారు.


మంచానికే పరిమితం

ఆదోని ఎస్కెడీ కాలనీ: ఆదోని పట్టణం లంగరబావివీధిలో నివాసం ఉంటున్న అల్లాబకాశ్‌ వయస్సు ఏడు పదులు దాటాయి.. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యారు.. మే నెల పింఛన్‌ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని సచివాలయ ఉద్యోగులు చెప్పారు. స్వతహాగా కూర్చోలేరు. ఇల్లు ఇరుకు వీధిలో ఉండటంతో కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని పరిస్థితి... అలాంటిది ఆటో లోపలికి వచ్చేదెలా.. బ్యాంకుకు వెళ్లేదెలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కాలు, చేయి ఆడదు

న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణ: ‘‘ మా ఆయన రాముడునాయక్‌కు మూర్ఛ వ్యాధితో ఒక కాలు, చేయి చచ్చుబడింది. అరికెర తండా నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఆలూరుకు బస్సు సౌకర్యం లేదు. మరికొందరితో కలిసి ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వచ్చాం. సేవా కేంద్రం వద్ద రెండు గంటలు నిరీక్షించి పింఛన్‌ డబ్బులు తీసుకున్నా.. రూ.150 ఖర్చు చేయక తప్పలేదని’’ దేవ్లిబాయి ఆవేదన వ్యక్తం చేశారు.


బ్యాంకు ఖాతా లేకున్నా..

వృద్ధురాలు షేక్‌ రమీజాబీ.. నగరంలోని వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉంటున్నారు. పింఛను సొమ్ము కోసం 95వ సచివాలయానికి వెళ్లి ఆరా తీశారు. పింఛను మొత్తం బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సచివాలయ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. తనకు బ్యాంకు ఖాతా లేకున్నా పింఛను సొమ్ము ఎలా జమ చేశారని ప్రశించారు. సచివాలయానికి శనివారమొస్తే అప్పుడు చెబుతామని సచివాలయ సిబ్బంది చెప్పడంతో ఇంటిదారి పట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని