logo

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

‘‘ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్‌ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన పేర్కొన్నారు.

Published : 10 May 2024 02:49 IST

 ప్రతిఒక్కరూ ఓటు వేయాలి

పోలింగ్‌ శాతం పెంపునకు కృషి

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.సృజన

 

మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.జి.సృజన, పక్కన ఎస్పీ కృష్ణకాంత్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ కల్యాణి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ‘‘ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్‌ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ కృష్ణకాంత్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కల్యాణితో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు..

 చరవాణులు అనుమతించం

పోలింగ్‌ కేంద్రాల్లోకి చరవాణుల అనుమతి లేదు. ఓటేసేందుకు వచ్చే ఓటర్లు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దు. కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ (పీవో)కు మాత్రమే అనుమతి ఉంటుంది. జిల్లాలో 1,866 సాధారణ పోలింగ్‌ కేంద్రాలుండగా 320 సమస్యాత్మక, 18 అత్యంత సమస్మాతక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిల్లో పోలింగ్‌ సరళి పర్యవేక్షించేందుకు 240 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించాం. పోలింగ్‌ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియోగ్రఫీ చేయిస్తాం. జిల్లాలో షాడో ఏరియాలో 8 పోలింగ్‌ కేంద్రాల లోపల మాత్రమే నెట్‌వర్క్‌ లేదు. ఆ ప్రాంతాల్లో హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంచుతున్నాం. మిగిలిన అన్నిచోట్ల ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాం. ఎన్నికల నేపథ్యంలో పెద్దఎత్తున కేంద్ర, పోలీసు బలగాలు నియమించాం.

  •  జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లోలో భద్రపరుస్తాం.

20.54 లక్షల మంది ఓటర్లు

  • జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో సాధారణ, సర్వీసు ఓటర్లు కలిపి మొత్తం 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 10,13,794, మహిళలు 10.40,451, ఇతరులు 318 ఉన్నారు.
  • ఇప్పటివరకు 20.05 లక్షల మంది ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశాం. శుక్రవారం సాయంత్రంలోగా మిగిలినవారికి అందిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు 12 రకాల ఓటరు గుర్తింపు కార్డుల్లో భాగంగా ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితరాల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లి ఓటేయొచ్చు. మొత్తం 28 ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
  • పోలింగ్‌ రోజున ఈవీఎం యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేరు చేయించేందుకు బెల్‌ కంపెనీ నుంచి ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు బెల్‌ ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతున్నాం.

11వ తేదీ సాయంత్రం ప్రచారం సమాప్తం

పోలింగ్‌కు 48 గంటల ముందు.. 11న సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. ఒకవేళ ప్రచారం చేసినా.. ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. జిల్లాకు సంబంధంలేని ఇతర జిల్లాల ఓటర్లు వెంటనే జిల్లా నుంచి వెళ్లిపోవాలి. శనివారం రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తాం.

రూ.8.19 కోట్ల నగదు స్వాధీనం

ఇప్పటివరకు రూ.8.19 కోట్ల నగదు, 17 వేల లీటర్ల మద్యం, 1.90 లక్షల లీటర్ల నాటుసారా బెల్లం ఊట, రూ.5.13 లక్షల విలువ చేసే 785.466 గ్రాముల బంగారం, రూ.2.45 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం.

2,204 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 1,847 పోలింగ్‌ కేంద్రాలు, నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో 357 కలిపి మొత్తం 2,204 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిల్లో అన్ని వసతులు కల్పించాం. అన్ని కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటుచేశాం. 1,096 ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఒకటి, రెండు వీల్‌ఛైర్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం. వైద్య శిబిరాలు సైతం నిర్వహిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు